Let's talk: editor@tmv.in
మణిపూర్ ప్రజలారా? నేనున్నా: ప్రధాని మోడీ

మణిపూర్ ప్రజలారా? నేనున్నా: ప్రధాని మోడీ

T Venkata Ramana
14 సెప్టెంబర్, 2025

మణిపుర్ పేరులోనే మణి ఉందని అది దేశానికే మణి వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలున్నాయని, ప్రస్తుతం ఇక్కడ శాంతి నెలకొంటోందని చెప్పారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మణిపుర్ ప్రజలకు తాను ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మణిపుర్లోని జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్పుర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో రైల్వే, రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్ కేటాయింపులను పెంచిందని ప్రధాని మోడీ తెలిపారు. 2014 నుంచి మణిపుర్లో కనెక్టివిటీని మెరుగుపరచడంపై తాను ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మణిపుర్ ధైర్యం, శౌర్యానికి నిలయంగా ఉందని ప్రశంసించిన ప్రధానమంత్రి, ఇంఫాల్ నుంచి రోడ్డు మార్గంలో చురాచంద్పూర్కు వెళ్లేటప్పుడు తనకు లభించిన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. తాను నిర్వాసితులతో మాట్లాడాన ని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ పరంగా ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయని మోడీ పేర్కొన్నారు.

ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు

ఈ వేదికపై రూ 7 వేల300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని మోడీ వెల్లడించారు. అవి మణిపుర్ ప్రజల జీవితాలను, గిరిజన వర్గాల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. అయితే రూ.7 వేల 300 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై తన ప్రభుత్వం దృష్టి సారించడంలో భాగంగా, రూ. 3 వేల 600 కోట్లకు పైగా విలువైన మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టుకు పునాది వేశారు. రూ.2 వేల 500 కోట్లకు పైగా విలువైన ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులు, మణిపుర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాలలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు .

పరామర్శించిన మోడీ

అంతకుముందు చురాచంద్పుర్ జిల్లాకు చేరుకుని అక్కడ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు మోడీ. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటుచేసుకోగా, రెండేళ్ల తర్వాత ఇప్పుడు ప్రధాని మోడీ ఆ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతకుముందు మిజోరాంలో పర్యటించిన మోడీ 8వేల70 కోట్లతో నిర్మించిన బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ను జెండా ఊపి ప్రారంభించారు. 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. 153 వంతెనలు, 45 సొరంగాలు లైన్లో ఉన్నాయి. మోడీ ఉదయం లెంగ్పుయ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఐజ్వాల్లోని లమ్మువల్ గ్రౌండ్లో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచే వర్చువల్గా ప్రాజెక్టులను ప్రారంభించారు.

రెండు రైళ్లు ప్రారంభం

అంతకుముందు మిజోరాంలో పర్యటించిన మోడీ 8వేల70 కోట్లతో నిర్మించిన బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ను జెండా ఊపి ప్రారంభించారు. 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. 153 వంతెనలు, 45 సొరంగాలు లైన్లో ఉన్నాయి. ఐజ్వాల్-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, సైరాంగ్, గువాహటి, కోల్కతా మధ్య మరో 2 రైళ్లను మోడీ ప్రారంభించారు. రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను ప్రధాని ప్రారంభించారు. రైల్వేలైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల బలోపేతం, ఉద్యోగాల కల్పన, పర్యాటక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని, కానీ బీజేపీ వల్ల ఈశాన్య రాష్ట్రాలు దేశ అభివృద్ధి ఇంజిన్లుగా మారాయని తెలిపారు.

ధరలు తగ్గుతాయి

2014కి ముందు టూత్పేస్ట్, సబ్బు, నూనె వంటి నిత్యావసర వస్తువులపై 27 శాతం పన్ను ఉండేది. ఇవాళ వాటిపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. కాంగ్రెస్ పాలనలో మందులు, పరీక్షా కిట్లు, బీమా పాలసీలపై భారీగా పన్ను విధించేవారు. అందుకే ఆరోగ్య సంరక్షణ ఖరీదైందిగా ఉండేది. సాధారణ కుటుంబాలకు బీమా అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. కొత్త జీఎస్టీ రేట్లు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులను మరింత ధరలను తగ్గిస్తాయి. సెప్టెంబర్ 22 తర్వాత సిమెంట్, నిర్మాణ సామగ్రి చౌకగా మారుతుంది. సంస్కరణల్లో భాగంగా చాలా హోటళ్లపై జీఎస్టీ కేవలం 5శాతానికి తగ్గించాం" అని మోడీ తెలిపారు.

మణిపూర్ ప్రజలారా? నేనున్నా: ప్రధాని మోడీ - Tholi Paluku