
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు పోలీస్ విభాగంలో భారీగా బదిలీలు చేపడుతూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది. 14 జిల్లాలకు కొత్త సూపరింటెండెంట్లు (ఎస్పీలు) నియమితులయ్యారు. వీరిలో 7 మంది కొత్త అధికారులు కాగా, మరో 7 మంది ఇతర జిల్లాల నుంచి బదిలీ అయినవారు. మిగిలిన 12 జిల్లాల్లో ప్రస్తుత ఎస్పీలను కొనసాగించారు.
ఊహించిన విధంగానే..
రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలు జరిగినప్పుడల్లా, ఐపీఎస్ల బదిలీలపైనా చర్చ జరుగుతుంది. అదే విధంగా ఇటీవల ఐఏఎస్ల బదిలీలు జరిగిన నేపథ్యంలో తర్వాత ఎస్పీల బదిలీలే అనుకున్నారు. అదే విధంగా పరిపాలనలో పారదర్శకతను పెంచేలా బదిలీలు జరుగుతున్నాయి. తాజా బదిలీల ప్రకారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ రావు, నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల, తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి, కడప జిల్లా ఎస్పీగా నచికేత్, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్ రాజు, చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్కుమార్ నియామకాలు జరిగాయి.
