Let's talk: editor@tmv.in
గ్లోబల్ వెల్నెస్ హబ్గా ఆయుర్వేదం

గ్లోబల్ వెల్నెస్ హబ్గా ఆయుర్వేదం

Venkatesh Balusula
14 సెప్టెంబర్, 2025

రానున్న రోజుల్లో ఆయుర్వేదం గ్లోబల్ వెల్నెస్ హబ్గా మారనుందని, ఆ దిశగా కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ చాప్టర్ తరఫున మూడు దశాబ్దాలుగా ఆయుర్వేదాన్ని ప్రజల్లో చైతన్యపరిచేందుకు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఆయుర్వేదాన్ని ఒక వైద్య విధానంగా మాత్రమే కాకుండా, భారతీయ జీవనశైలిలో వెల్నెస్, శారీరక, మానసిక సమతుల్యతకు సంబంధించిన సంపూర్ణ తత్వశాస్త్రంగా చూడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్ది మాట్లాడుతూ ఆయుర్వేదానికి ఉన్న చరిత్ర, గొప్పతనం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సుశ్రుతుడు, చరకుడు, వాగ్భట్టు లాంటి మహనీయులు శస్త్రచికిత్సలు, ఫిజియాలజీ, థెరపీల్లో ఇచ్చిన విశేషాంశాలను గుర్తు చేశారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు ప్రపంచ వైద్యరంగానికి మార్గదర్శకంగా నిలిచినట్లు తెలిపారు. ఆయుర్వేదాన్ని పునఃప్రచురణలోకి తీసుకురావడంలో 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంభవించిన మార్పులను వివరించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తింపు పొందేందుకు ప్రధానమంత్రి చేసిన కృషిని గుర్తు చేశారు. యోగా, ఆయుర్వేదం కరోనా సమయంలో ప్రపంచానికి ఒక ప్రత్యామ్నాయ నివారణ మార్గంగా నిలిచాయని, ఆయుర్వేద పద్ధతులు ప్రజలకు భరోసానిచ్చాయని వివరించారు.

అంతర్జాతీయంగా పెరిగిన ప్రాధాన్యత

కరోనా సమయంలో పాశ్చాత్య దేశాలు భారత్లో 50 కోట్ల మంది మృతి చెందుతారని భయబ్రాంతులకు గురిచేసినా, ఆయుర్వేదంపై ఆధారపడి 140 కోట్ల మంది సురక్షితంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తిప్పతీగ, పసుపు లాంటి భారతీయ మూలికల వినియోగం అంతర్జాతీయంగా పెరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్ రంగం అభివృద్ధికి కేంద్రం ద్వారా అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద సిద్ధిపేట, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయిందన్నారు. రామంతపూర్లోనూ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణలో 420 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. 440 ఆయుష్ డిస్పెన్సరీలు, 366 డిస్పెన్సరీలు రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 7.5 లక్షల మంది రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీషనర్లు ఆరోగ్య భారత్ నిర్మాణంలో కీలకంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.

కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే

ఆయుర్వేద రంగ అభివృద్ధికి కేంద్రం బలమైన విధానాలతో ముందుకెళ్తున్నదని కిషన్ రెడ్డి చెప్పారు. 2014లో 3 బిలియన్ డాలర్లున్న ఆయుష్ రంగం, కేవలం పదేళ్లలోనే 24 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. భారతీయ ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిందని చెప్పారు. స్టార్టప్లు, న్యూట్రాస్యూటికల్ సంస్థలు గ్లోబల్ మార్కెట్లో భారతీయ బ్రాండ్కు గుర్తింపు తీసుకొస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ పత్రికలు, జర్నల్స్లో పరిశోధనలు ప్రచురించడం ద్వారా ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలని ఆయుర్వేద డాక్టర్లకు సూచించారు. దేశంలోని ఐఐటీలు, జేఎన్యూ, ఐఐఎస్ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో ఆయుష్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం దీనికి ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుతం బహుళజాతి ఫార్మా కంపెనీలు, అలోపతి మందుల లాబీలు ఆయుర్వేద, యోగా పట్ల కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లాబీలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయుర్వేదాన్ని కాపాడుకోవడం భారతీయుల బాధ్యతగా పేర్కొన్నారు. రామ్ దేవ్ లాంటి ఆయుర్వేద ప్రచారకులు ఎదుర్కొంటున్న అడ్డంకులకు అన్ని వర్గాల మద్దతు అవసరమన్నారు.

వందకు పైగా దేశాల్లో వినియోగం

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తున్నారని, ఆయుర్వేదం ఇప్పుడు భారతదేశపు ‘సాఫ్ట్ పవర్’గా మారిందన్నారు. ఆయుష్ వీసాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోందని వివరించారు. వికసిత భారత్ – 2047 లక్ష్యాన్ని సాధించడంలో ఆరోగ్య భారత్ కీలక భాగమని, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రధానమైన పిలర్గా ఉండబోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానంలో ఆయుష్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాబోయే తరాలకూ ఆయుర్వేదం మరింత చేరువవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆయుష్ గ్రామాల ఏర్పాటు ద్వారా క్షేత్రస్థాయిలో సేవల విస్తరణ జరుగుతోందని వివరించారు. ఆయుర్వేద విభాగానికి చెందిన మేధావులు, పరిశోధకులు తమ పరిశోధనలను, ఆవిష్కరణలను ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో పంచుకోవాలంటూ పిలుపునిచ్చారు. దేశ సంపదగా, జీవన శైలిగా, సంస్కృతిగా ఆయుర్వేదాన్ని రక్షించి, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని స్పష్టం చేశారు.

గ్లోబల్ వెల్నెస్ హబ్గా ఆయుర్వేదం - Tholi Paluku