
బీహార్లో ఎవరి లెక్కలు వారివే
త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు చాలా కీలకమైన దశ లో ఉన్నాయి. ముఖ్యంగా మహాఘట్బందన్(కూటమి) లో పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయితే ఎన్నికల క్షేత్రంలోకి దూకొచ్చు. కానీ ఘట్బందన్ లో ఆ దిశగా చర్చలు సవ్యంగా సాగడం లేదు. ఇటీవల ఆర్జేడీ నాయకులు ఘట్బందన్ లో కీలక నాయకుడైన తేజస్వీ యాదవ్ నివాసంలో సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీట్ల విషయంలో ఘట్బందన్ లోని పార్టీలు పట్టు విడుపులు ఉండాలని కోరారు. త్యాగాలు చేయాల్సి రావొచ్చని సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని తెలిపారు.
మహఘట్బందన్ లో ఉన్న పార్టీలు
కూటమి లో ఎనిమిది పార్టీలు ఉన్నాయి. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో జెఎంఎం, ఎల్జేపీ(పరాస్) రెండు పార్టీలు జతకట్టనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు కొంత సంక్లిష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ ఎంఎల్ సీపీఎం, వీఐపీ, ఉన్నాయి. ఈ సారి మరో రెండు పార్టీలు కూటమిలో చేరడంతో ఎనిమిది పార్టీల మద్య సీట్ల పంపకం ఉంటుంది. అయితే అన్ని పార్టీలు తాము ఎన్నికల్లో నిర్వహించే ప్రదర్శన ప్రకారం సీట్లను డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు ఉండే అవకాశాలు ఉన్నాయి.
బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆర్జేడీ గత ఎన్నికల్లో 144 సీట్లలో పోటీ చేసింది. అయితే 75 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి కూడా దాదాపు 150 నియోజకవర్గాల్లో పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ కూటమిలో పార్టీల సంఖ్య ఎక్కువ కావడం వలన 120 నుంచి 140 సీట్లను తీసుకునేందుకు సుముఖత వక్యం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే బాటలో నడవనుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసి 19 స్ఠానాల్లో మాత్రమే జెండా ఎగురవేసింది. అయితే ఈ సారి బీహార్ లో కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ, ఓటర్ జాబితా సవరణపై చేసిన ‘ఓట్ అధికార్ యాత్ర’ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జవజీవాలు కూడగట్టుకుంది. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో 70 సీట్ల లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కుమార్ తెలిపినప్పటికీ ఎన్డీయే కూటమి పై గెలుపే ప్రధానంగా సీట్ల విషయంలో కాస్తా వెనక్కి తగ్గే అవకాశం ఉంది.
కమ్యూనిస్ట్ పార్టీల స్థానాలు పెరిగే అవకాశం
ఈ సారి ఎన్నికల్లో బీహార్ లోని కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు 30 నుంచి 45 సీట్లకు పైగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. సీపీఐ, సీపీఐ ఎంఎల్, సీపీఎం మూడు ఎన్నికల రణరంగంలో ఉండనున్నాయి. గత ఎన్నికల్లో సీపీఐ–ఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 స్థానాలు గెలుచుకుంది. అలాగే సీపీఎం కూడా నాలుగింటిలో రెండు గెలుచుకుంది. సీపీఐ 6 సీట్లలో పోటీ చేస్తే 2 స్థానాల్లో గెలిచింది. 27 స్థానాల్లో పోటీ చేసిన కమ్యూనిస్ట్ లు దాదాపు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఈ సారి మరిన్ని అసెంబ్లీ స్థానాల కోసం పట్టుపట్టేందుకు ఆస్కారం ఉంది. పార్టీ కూడా ప్రజల్లో బాగా విస్తరించింది. కూటమిలోని నాయకులు కూడా గత ఎన్నికల్లో కమ్యూనిస్ట్ ల గెలుపు ఆధారంగా ప్రస్తుతం వ్యవహరించే వీలుంది.
60 సీట్లు ఆశిస్తున్న వీఐపీ
ఇదిలా ఉంటే కూటమిలో ముఖేశ్ సహనీకి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) దాదాపు 60 స్థానాలను ఆశిస్తుంది. అయితే అన్ని సీట్లు ఇచ్చే విషయంలో కూటమి సిద్ధంగా లేదు. పార్టీని 2018 లో స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరం జరగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేలో చేరినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎన్నికల్లో ప్రదర్శన చేయలేదు. 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ నాలుగు స్థానాల్లో అద్భుతమైన విజయం సాధించింది. ముఖేశ్ సహానీ ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి నితీశ్ కేబినేట్ లో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ పార్టీ మత్య్సకారుల అభివృద్దే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీహార్ లో దాదాపు 12 శాతంపైగా మత్య్సకారులు ఉన్నారు. అయితే ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరడంతో సహనీ ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకుని 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకు వెళ్లారు. అయితే ఈసారి కూటమిలో చేరి దాదాపు 60 స్థానాలను ఆశిస్తూ, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కోరుకుంటున్నారు. అయితే అన్ని సీట్లను ఇవ్వడానికి కూటమి సుముఖంగా లేదు. 20 లోపు ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు పేర్కోంటున్నాయి.
అలాగే పరాస్ లోక్ జనశక్తి 5 స్థానాలను ఆశిస్తోంది. అలాగే బీహార్ సరిహద్దుల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున జార్ఖండ్ ముక్తి మోర్చా కు రెండు నుంచి ఐదు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. అయితే సీట్ల విషయంలో కూటమిలో పట్టువిడుపులు ఉండే ఆస్కారం ఉంది. ఎన్డీయే కూటమిని గద్దె దించడమే ప్రధానంగా ముందుకు వెళ్లనుంది. అయితే ఎన్డీయే కూటమిలో సీఎం అభ్యర్థిగా నితీశ్ ను ఇప్పటికే ప్రకటించారు. ఇటు కూటమిలోనూ అధికారికంగా సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటకీ తేజస్వీ యాదవ్ ఇటీవల జరిగిన ఓట్ అధికార్ యాత్రలో భాగంగా ఆరా పట్టణంలో జరిగిన ర్యాలీలో నితీశ్ ను డూప్లికేట్ సీఎంగా విమర్శిస్తూ తనను తాను ఒరిజనల్ సీఎంగా రాహుల్ గాంధీ ముందు ప్రకటించుకున్నారు. అయితే ఈ విషయం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.
