Let's talk: editor@tmv.in
కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై పోరాడతాం

కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై పోరాడతాం

Venkatesh Balusula
13 సెప్టెంబర్, 2025

తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల అసోసియేషన్ ప్రతినిధులు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావును కలిసి తమ స‌మ‌స్య‌లు వివరించారు. ఈ రంగంపై లక్షా యాభై వేలకు పైగా కుటుంబాలు జీవనోపాధి కోసం ఆధారపడి ఉన్నాయ‌న్నారు. సమస్యల పరిష్కారానికి పోరాడి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రాంచందర్ రావు భరోసా ఇచ్చారు.

క‌ఠిన నిర్ణ‌యాలు స‌రికాదు

నేడు ఇందిరా పార్కులో తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల అసోసియేషన్ ప్రతినిధులు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల అసోసియేషన్ ప్రతినిధులు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాంచందర్ రావు వెల్లడించారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హైదరాబాద్ రామంతాపూర్ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టేలా ఉపాధి కోల్పోయేలా పరిస్థితి సృష్టించారన్నారు.

లక్షా యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్న ఈ చిన్న వ్య‌వ‌స్థ‌పైనే ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు కట్ చేయడం వంటి కఠిన నిర్ణయాలు సరికాదని హెచ్చరించారు. దీంతో లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు నష్టపోయే ప్రమాదం ఉందని ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సేవలు వినియోగదారులకు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలన్నారు. కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్లను కేబుల్ ఆపరేటర్లకు అందిస్తూ వారి వద్ద రెంట్ తీసుకుంటూ సేవలు అందించడానికి సహాయం చేస్తోందని చెప్పారు. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆప్టిక్ ఫైబర్ సౌకర్యాలను కేబుల్ ఆపరేటర్లకు అందిస్తే మేలు జరుగుతుందని సూచించారు.

కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై పోరాడతాం - Tholi Paluku