Let's talk: editor@tmv.in
వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అతడే: పాక్ కోచ్

వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అతడే: పాక్ కోచ్

Shaik Mohammad Shaffee
13 సెప్టెంబర్, 2025

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, ఆ జట్టు స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను ప్రశంసల‌తో ముంచెత్తారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో హెస్సన్ మాట్లాడుతూ, మహ్మద్ నవాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని ప్రకటించారు. పాకిస్థాన్ జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండడం తమకు ప్రధాన బలం అని చెప్పారు. అందులో ముఖ్యంగా గత ఆరు నెలలుగా నవాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అందుకే ఆయన ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్నర్ అని కొనియాడారు. కాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఎందుకంటే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మహ్మద్ నవాజ్ ప్రస్తుతం టాప్-15లో కూడా లేడు. ఆయన ప్రస్తుతం 30వ ర్యాంక్‌లో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో హెస్సన్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశ్యం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్, భారత్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రత్యర్థి జట్టుపై మానసిక ఒత్తిడి పెంచాలని హెస్సన్ ప్రయత్నిస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహ్మద్ నవాజ్‌తో పాటు ఆబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ వంటి స్పిన్నర్లు కూడా పాకిస్థాన్ జట్టులో ఉన్నారు. ఈ స్పిన్ విభాగం తమకు ప్రధాన బలంగా ఉంటుందని హెస్సన్ నొక్కి చెప్పారు.

నవాజ్ గణాంకాలను పరిశీలిస్తే, ఆయన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 71 మ్యాచ్‌లలో 70 వికెట్లు తీశాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, యూఏఈతో జరిగిన ట్రై సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడం ద్వారా తన బౌలింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. ఈ సిరీస్‌లో నవాజ్ మొత్తం ఐదు మ్యాచ్‌లలో 11.70 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఈ ఆసియా కప్ టోర్నమెంట్‌లో నవాజ్ ఎలా రాణిస్తాడో చూడాలి మరి.

వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అతడే: పాక్ కోచ్ - Tholi Paluku