Let's talk: editor@tmv.in
వరల్డ్‌కప్‌ డౌటేనా?

వరల్డ్‌కప్‌ డౌటేనా?

FL - TRND
13 సెప్టెంబర్, 2025

అమెరికా వేడెక్కుతోంది.. 2026 ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌కు మూడేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఫుట్‌బాల్‌ మైదానాలు వేడెక్కిపోతున్నాయి. 16 స్టేడియాల్లో 10 స్టేడియాలు ప్రమాదంలో పడుతున్నాయి. క్రీడాకారులు చెమటలో తడుస్తున్నారు. ప్రేక్షకులు ఊపిరి ఆడక వేదన పడుతున్నారు. 90 శాతం స్టేడియాల్లో మార్పులు చేయక తప్పదు. నీరు కూడా దొరకని రోజులొస్తున్నాయి. అటు తిరిగి, ఇటు తిరిగి వరల్డ్‌కప్ పండుగ కాస్త వాతావరణ విపత్తుగా మారుతుందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక ఫిఫా ఇప్పటికే జాగ్రత్తలు మొదలుపెట్టింది. మ్యాచ్‌ల మధ్యలో నీటి విరామాలు పెంచింది. 32 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటితే ఆట ఆగాలనే కొత్త నిబంధన పెట్టింది. 13 స్టేడియాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా అట్లాంటా, మియామి, కెన్సాస్ సిటీ, హ్యూస్టన్, డల్లాస్‌లో గత రెండు నెలలకుపైగా అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. 10 స్టేడియాల్లో ప్రతి వేసవిలో కనీసం ఒక రోజైనా 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మార్క్‌ను సూర్యుడు టచ్ చేస్తున్నాడు. నార్త్ అమెరికా ప్రాంతాల్లో ఇది మనిషి తట్టుకోగల చివరి డెడ్‌లైన్‌గా చెప్పవచ్చు. డల్లాస్ 31 రోజులు ఇలా కాలిపోయింది. హ్యూస్టన్ ఏకంగా 51 రోజుల పాటు ఆ పరిమితిని దాటింది. అందుకే అక్కడ స్టేడియాలకు కొత్త రూఫ్‌లు వేస్తున్నారు. ఇక భవిష్యత్తులో అన్ని మైదానాల పరిస్థితి ఇదే అవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

చరిత్రను ఒకసారి గమనిస్తే సూర్యుడి కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మరాథాన్ రన్నర్స్‌ చాలామంది మధ్యలో పడిపోయారు. 1994 యుఎస్ ఓపెన్ టెన్నిస్‌లో హీట్ స్ట్రోక్ కారణంగా మ్యాచ్‌లు ఆపేశారు. 2003లో పారిస్‌లో ఫుట్‌బాల్ లీగ్ ఆటలు వాయిదా పడ్డాయి. క్రికెట్‌లోనూ ఉదాహరణలు ఉన్నాయి. 2018లో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతను తట్టుకోలేక ఆగిపోయారు. ఇటు హాకీ, బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లు కూడా భారీ ఉష్ణోగ్రతల కారణంగా వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు 2026 వరల్డ్‌కప్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే డౌట్ కలుగుతోంది.

మరోవైపు ఉష్ణోగ్రత పెరగగానే ఆటగాళ్ల శరీరం కుదేలవుతుందని, శరీరంలో నీరు ఆవిరైపోయి గుండె వేగం పెరుగుతుందని, హీట్ స్ట్రోక్ ఒక్కసారిగా దెబ్బతీస్తుందని, 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఆటగాళ్ల శరీరం తట్టుకోలేనిదిగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత వేడిలో పరుగులు తీయడం చాలాకష్టం. ఇటు అభిమానులు కూడా స్టేడియంలో కూర్చోలేరు. చివరకు ఇది ఒక గేమ్‌లా కాకుండా ఒక శిక్షలా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడా సంస్థలు సైలెంట్‌గా ఉండలేవు. ఫిఫా కొత్త నిబంధనలు పెడుతోంది. ఐఓసీ కూడా ఒలింపిక్స్ కోసం మార్పులు ఆలోచిస్తోంది. 2040 నాటికి నెట్‌జీరో లక్ష్యం పెట్టుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఇది కేవలం పత్రాల మీద మాటలతో ఆగిపోతుందా? లేక నిజంగా స్టేడియంలు మారుతాయా అన్నది సందేహం. అభిమానులు కూడా చల్లటి వాతావరణం కోరుతున్నారు. 91 శాతం మంది సర్వేలో ఇదే చెప్పారు. క్రీడా పండుగను కాపాడాలంటే వాతావరణాన్ని కాపాడాలి.. లేదంటే వరల్డ్‌కప్ అనే పండుగ రేపు విపత్తుగా మారిపోవడం ఖాయం భయ్యా!

వరల్డ్‌కప్‌ డౌటేనా? - Tholi Paluku