Let's talk: editor@tmv.in
పగటి పూటే అధిక ప్రమాదాలు

పగటి పూటే అధిక ప్రమాదాలు

FL - TRND
13 సెప్టెంబర్, 2025

ప్రతి ఉదయం లేస్తే మనకు రోడ్డు కనబడుతుంది కానీ.. ఆ రోడ్డు కేవలం ప్రయాణానికి దారి కాదు... అది రక్తపు రేఖలతో నిండిన మరణ గాథ. 2023లో భారత్‌లో దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. లక్షా72వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 62వేల మంది గాయాల బారిన పడ్డారు. ఇవి కేవలం ప్రభుత్వం చూపిస్తున్న అంకెలు కావు... ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబపు కన్నీరు విలపిస్తుంది. ఒక తల్లి గుండెల్లో రంధ్రం, ఒక చిన్నారి జీవితంలో శూన్యం కనిపిస్తుంది.

రోజు ముగిసే సాయంత్రం...అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డు మీద మృత్యువు నృత్యం చేస్తుంది. ఈ మూడు గంటల్లోనే 20శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌, పని అలసట, కోపం, నిర్లక్ష్యం లాంటివి కలిపి రోడ్లను రక్తరంగం చేస్తాయి. రాత్రి పన్నెండు దాటితే ప్రమాదాలు తక్కువగా ఉన్నా... జరిగితే మాత్రం భయంకరంగా ఉంటాయి. వేగం, మత్తు, నిద్రలేమి.. ఇవే అర్థరాత్రి రాక్షసులు. ఇంకా ఒక భయానక నిజముంది. అదే మే నెల...! అవును..! ఏడాదిలో మే నెల అత్యంత భయానక మాసం. 2023లో అత్యధికంగా మేలోనే 43,600 ప్రమాదాలు జరిగాయి. 16,700 మరణాలు రికార్డయ్యాయి. మే తర్వాత ఈ స్థానంలో జనవరి నిలిచింది. జనవరిలో 41,800 ప్రమాదాలు నమోదయ్యాయి. డిసెంబరు కూడా తన వంతు రక్తగాథ రాసింది. 41,000 ప్రమాదాలు డిసెంబర్‌లో జరిగాయి. వేసవి వేడి, ఇయర్‌ ఎండింగ్‌ ఉత్సాహం కొంపముంచాయి. ఈ కారణాలే మరణానికి ఆహ్వానమిచ్చాయి.

మనం సాధారణంగా అనుకునే విషయం ఒకటుంది. వాన పడితేనో, పొగమంచు కమ్మితేనో ప్రమాదాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ నిజం మరీ భయానకంగా ఉంది. 3 లక్షల 70 వేల ప్రమాదాలు స్పష్టమైన ఆకాశం కిందే జరిగాయి. అంటే ఎండలో, క్లియర్ స్కై వాతావరణంలో, పూర్తి వెలుగులోనే ఎక్కువ రక్తం పారింది. వానలో 37వేల ప్రమాదాలు మాత్రమే జరిగాయి. పొగమంచులో 34 వేల మాత్రమే రికార్డయ్యాయి. కానీ ఎండలో... లక్షల సంఖ్య నమోదైంది. ప్రతీ 10 యాక్సిడెంట్స్‌లో ఏకంగా 8 ప్రమాదాలు పూర్తి వెలుతురులోనే జరిగాయి. 2022తో పోలిస్తే 2023లో 4.2 శాతం ప్రమాదాలు ఎక్కువ. మరణాలు 2.6 శాతం పెరిగాయి. గాయాలు 4.4 శాతం ఎక్కువయ్యాయి. ఇది ఒక వ్యాధి... రోడ్ల వ్యాధి. ఇది వైరస్ కాదు, ఇది బాక్టీరియా కాదు... ఇది మన మనుషుల నిర్లక్ష్యం. అందుకే ప్రతి రోజు ఒక కుటుంబం చీకట్లో మునిగిపోతోంది. ప్రతి గంట ఒక రక్తపు చుక్క రోడ్డుపై జారిపోతోంది. ప్రతి నిమిషం ఒక హృదయం ఆగిపోతోంది. ప్రశ్న మాత్రం ఒకటే... ఇది ఎవరి తప్పు? రోడ్లదా? వాతావరణమా? లేదా మనుషుల నిర్లక్ష్యమా? నిజం మాత్రమే ఒక్కటే... సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదివరకు... మే నెలలో... ఎండలో... రోడ్డు మీద మరణం ఎదురుచూస్తోంది. అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించండి. మీ కోసం మీ ఇంట్లో ఎదురుచూస్తున్న వాళ్లు ఉన్నారని గుర్తుపెట్టుకోండి.

పగటి పూటే అధిక ప్రమాదాలు - Tholi Paluku