
అమెరికాలో భారతీయ విద్యార్ధుల కలవరం
అమెరికాలో చదువు అనేది భారతీయ కుటుంబాల కలల గమ్యం. ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, ఉద్యోగ అవకాశాల వాగ్దానం అన్నీ ఒకే చోట లభిస్తాయనే నమ్మకం ఉంది. అందుకే 2023-24 విద్యా సంవత్సరంలోనే 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు అమెరికన్ యూనివర్సిటీలలో చేరారు. కానీ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కొత్త వీసా ప్రతిపాదనలు ఆ కలకు గందరగోళం తెచ్చాయి. నాలుగేళ్ల కాలపరిమితిని విధించే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల అనుభవం పూర్తిగా మారిపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థలో విద్యార్థులు తమ కోర్సు కొనసాగించేంతవరకూ అమెరికాలో ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రతిపాదించిన విధానం ప్రకారం ఎఫ్-1, జే-1 వీసాలు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. డాక్టరేట్, డ్యూయల్ డిగ్రీ, స్టెమ్ కోర్సులు సాధారణంగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పట్టే కాబట్టి మధ్యలోనే విద్యార్థులు 'ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టే' కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం పేపర్ వర్క్ మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి, ఆర్థిక భారాన్ని కూడా తెస్తుంది.
అమెరికా విశ్వవిద్యాలయాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ విద్యార్థులు వారి క్యాంపస్‌లకు వైవిధ్యం, పరిశోధన శక్తి, ఆర్థిక స్థిరత్వం అందించే బలమైన వనరు. గతంలో 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదన వచ్చింది, కానీ విద్యా రంగం ప్రతిఘటనతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి కూడా విశ్వవిద్యాలయాలు విద్యార్థుల కోసం సహాయక చర్యలు చేపడుతున్నాయి. వీసా సలహా కేంద్రాలు, టైమ్‌లో ఎక్స్‌టెన్షన్ దరఖాస్తులు, ఇంటర్న్‌షిప్‌లను వీసా పరిమితులకు సరిపడేలా మార్చడం లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టాయి.
అయితే సమస్య కేవలం పేపర్ వర్క్, ఖర్చు మాత్రమే కాదు. విద్యార్థుల మానసిక స్థితి కూడా ఇక్కడ ముఖ్యమవుతుంది. పరిశోధన, చదువు, ఇంటర్న్‌షిప్ లాంటి కఠినమైన పరిస్థితితో పాటు ఇప్పుడు వీసా గడువు అనే కొత్త టెన్షన్ వారిని మరింతగా ప్రభావితం చేస్తుంది. 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించడం మరో పెద్ద సమస్య. ఆ సమయం లోపల ఇంటర్న్‌షిప్ పొందడం, ఉద్యోగం దొరకడం లేదా ఎక్స్‌టెన్షన్ దరఖాస్తు పూర్తి చేయడం చాలా కష్టం.
ఇది కుటుంబాలకు కూడా ఒక ఆర్థిక భారంగా మారుతుంది. ఒక్కోసారి వీసా ఎక్స్‌టెన్షన్ కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇదే సమయంలో ట్యూషన్ ఫీజులు సంవత్సరానికి 20 నుంచి 45 వేల డాలర్ల మధ్య ఉంటే, లివింగ్ ఖర్చులు వేరే. ఇంత పెట్టుబడి పెట్టి చదువు మధ్యలో నిలిచిపోతే, నష్టం కేవలం డబ్బు మాత్రమే కాదు, భావోద్వేగ పరంగా కూడా పెద్ద దెబ్బ అవుతుంది. ఈ నేపథ్యంలో అనేక కుటుంబాలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాయి. కెనడా, యుకే, ఆస్ట్రేలియా మాత్రమే కాదు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన వీసా టైమ్‌లైన్స్‌తో, స్థిరమైన ఉద్యోగ అవకాశాలతో ఈ దేశాలు అమెరికాకు పోటీ ఇస్తున్నాయి. జర్మనీలో ప్రస్తుతం దాదాపు 40 వేల భారత విద్యార్థులు చదువుతున్నారు. న్యూజిలాండ్, ఫ్రాన్స్, ఇటలీ కూడా కొత్తగా ఆకర్షణీయంగా మారాయి.
అయినా, అమెరికా ఇప్పటికీ విద్యార్థుల కలల గమ్యమే. నిపుణులు చెబుతున్నది ఏంటంటే.. విద్యార్థులు ప్రణాళికతో ముందుకు వెళితే, ఈ సవాళ్లను తట్టుకోవచ్చు. నాలుగేళ్లలో పూర్తయ్యే కోర్సులను ఎంచుకోవడం, పరిశోధనలో ఆలస్యం జరిగితే ముందుగానే ఎక్స్‌టెన్షన్ దరఖాస్తు చేయడం, అదనపు ఖర్చులను ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో లెక్కించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మొత్తానికి, ఈ ప్రతిపాదన ఒక హెచ్చరిక. విదేశీ విద్య కల అనేది కేవలం ట్యూషన్ ఫీజులు చెల్లించి చేరడం కాదు. అది పాలసీ మార్పులు, వీసా నియమాలు, అంతర్జాతీయ పోటీ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. భారత విద్యార్థులు ఇప్పుడు మరింతగా చురుకుగా, సౌకర్యవంతంగా ప్రణాళికలు వేసుకోవాలి. అమెరికా పాలసీ మేకర్లు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. టాలెంట్ కోసం పోటీ పెరుగుతున్న ఈ సమయంలో, కేవలం నియమాలు కఠినతరం చేయడం కాకుండా, అవకాశాలను కూడా పెంచడం ద్వారానే తమ దేశాన్ని ఆకర్షణీయంగా ఉంచగలరు. భారతీయ కుటుంబాలకైతే, ఈ కలను సాధించడంలో సహనం, ముందుచూపు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అమెరికాలో చదువుకునే కల ఇంకా బ్రతికే ఉంది, కానీ దానికి చేరే మార్గం మాత్రం మరింత క్లిష్టమవుతోంది.
