
భారత్‌పై సుంకాలకు వెనుకడుగు
ప్రపంచ దేశాలపై సుంకాల భారం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరింత కక్ష కట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు ఇప్పటికే 50 శాతం సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. చమురు కొనుగోళ్లు ఆపాలని, లేదంటే మరిన్ని ఆంక్షలు విధిస్తామని బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అమెరికా ద్వితీయ సుంకాలు చాలదన్నట్లు భారత్‌పై సుంకాల భారం మోపాలని యూరోపియన్ దేశాలను ట్రంప్ ఆదేశించారు. కానీ, ఆయా దేశాలు అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
రష్యాపై ఆర్థిక భారం మోపేందుకే
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న దేశాలు పరోక్షంగా యుద్ధానికి ప్రోత్సాహం అందిస్తున్నారని, వెంటనే ఈ కొనుగోళ్లు ఆపేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చైనా, భారత్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధికారులు, ట్రంప్ టీం భారత్‌ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దీనికి భారత్ సమాధానమిస్తూ దేశ అవసరాల కోసమే చమురు కొనుగోళ్లు చేస్తామని, భారత్‌కు ప్రత్యేక విదేశాంగ విధానముందని స్పష్టం చేసింది. కానీ, ట్రంప్ వ్యక్తిగత సహాయకుడు నవారో ఉక్రెయిన్ యుద్దాన్ని మోడీ యుద్ధంగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
సుంకాలపై యూరప్ దేశాల స్పష్టత
రష్యాను ఆర్థికంగా దెబ్బ తీస్తే యుద్ధం ఆపవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రష్యాకు ఆర్థికంగా బలంగా మారిన చమురు కొనుగోళ్లను ఆపాలని నిర్ణయించాడు. అత్యధికంగా చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్, చైనాలపై ఒత్తిడి పెంచేందుకు వంద శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ దేశాలను ఆదేశించారు. ముందుగా ఆయా దేశాలు దీనికి అంగీకరించినా కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. భారత, చైనాలపై వంద శాతం సుంకాలకు యూరోపియన్ యూనియన్ నిరాకారిస్తోంది. యూరప్ సుంకాల విధానాన్ని చాలా జాగ్రత్తగా, సుదీర్ఘ దర్యాప్తుల తరువాత మాత్రమే అమలు చేస్తుందని స్థానిక అధికారులు చెప్తున్నారు. భారత్‌పై సుంకాలు విధించే అంశం ఇప్పటి వరకు చర్చలోకే రాలేదని, పైగా భారతదేశంతో వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని ఒక ప్రముఖ యూరప్ డిప్లొమాట్ వ్యాఖ్యానించారు.
సానుకూలంగా మారుతున్న వ్యవహారం
ట్రంప్ మాత్రం యూరప్ యూనియన్ రష్యాపై ఒత్తిడి పెంచాలంటే చైనా, భారత్‌లపై దండయాత్ర చేయాలనే అభిప్రాయాన్ని కొనసాగించారు. కానీ యూరప్ మాత్రం ప్రత్యేకంగా సంస్థలపైనే ఆంక్షలు కొనసాగించాలని భావిస్తోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌పై అమెరికా వైఖరి కాస్త మెత్తబడినట్టు కనిపిస్తోంది. రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనిపై భారత ప్రధాని మోడీ స్పందిస్తూ, “ఇరు దేశాల భాగస్వామ్యం అద్భుత భవిష్యత్తును సాధించగలదని నమ్మకం ఉంది” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ట్రంప్, మోడీ మధ్య నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో సానుకూల సంభాషణ కావడం గమనార్హం. దీంతో చర్చలు జరిగితే భారత్‌పై మోపిన సుంకాల్లో ఏమైనా మార్పులు జరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
