Let's talk: editor@tmv.in
భార‌త్‌ను చైనాకు దూరం చేస్తాం!

భార‌త్‌ను చైనాకు దూరం చేస్తాం!

Venkatesh Balusula
13 సెప్టెంబర్, 2025

భార‌త్, అమెరికా సంబంధాల‌పై అమెరికా రాయ‌బారి అభ్య‌ర్థి సెర్జియో గోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌ను చైనాకు దూరం చేయ‌డ‌మే త‌మ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో భార‌త్‌తో అమెరికా సంబంధాల‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. అమెరికా ప్రభుత్వం తరఫున భార‌త్‌లో త్వ‌ర‌లో రాయబారిగా బాధ్యతలు చేపట్టబోయే సెర్జియో, వాణిజ్యం, ఇంధన‌ రంగాల్లో భారత్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశ‌గా అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని వ్యాఖ్యానించారు.

కీల‌కంగా మార‌నున్న‌ వాణిజ్య ఒప్పందాలు

భార‌త‌ మార్కెట్‌లో అమెరికా చమురు, ఎల్పీజీ, పెట్రోలియం ఉత్పత్తులకు మార్గం సుగ‌మ‌మం చేయాలన్న దానిపై ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని గోర్ తెలిపారు. భారత్ మధ్య తరగతి ప్రజల సంఖ్యే అమెరికా జనాభా కంటే ఎక్కువ అని, ఇది ఎంత పెద్ద అవకాశమో మనం అర్థం చేసుకోవాల‌ని గోర్ అభిప్రాయపడ్డారు. చైనా విస్తరణతత్వం కేవలం భారత్ సరిహద్దులకే పరిమితం కాలేదని, ఆసియా మొత్తం మీద దాని ప్రభావం పెరుగుతోందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. భారత్‌, అమెరికా మధ్య ఈ మధ్యకాలంలో కొన్ని అభిప్రాయ భేదాలున్నా, అవన్నీ తుది ఒప్పంద దశలో పరిష్కారం కుదిరే అవకాశముందని సెర్జియో చెప్పారు. వ్యాపారానికి అడ్డుగా ఉన్న పరిరక్షణ విధానాలు, నియంత్రణలపై దృష్టి సారించి, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు.

ప్ర‌పంచ దేశాల్లో భార‌త్‌కే ప్రాధాన్య‌త‌

ప్ర‌పంచ దేశాల్లో భార‌త్‌కే అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని సెర్జియో స్ప‌ష్టం చేశారు. అలాగే భారత్‌ నుంచి ఏదైనా ఎక్కువ ఆశిస్తామ‌ని, మిగతా దేశాల కంటే ఇక్కడి నుంచే త‌మ‌కు అంచనాలు ఎక్కువగా ఉన్నాయ‌న్నారు. ఈ అనుబంధమే ఇరుదేశాల మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తోంద‌ని పేర్కొన్నారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలో వాషింగ్టన్‌ పర్యటనకు రానున్నార‌ని, ఆ స‌మ‌యంలో కీలక వాణిజ్య ఒప్పందంపై ముసాయిదా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఒప్పందం 21వ శతాబ్దాన్ని నిర్వచించే భాగస్వామ్యంగా నిలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. భార‌త్‌ను నమ్మ‌క‌పోతే ఈ శ‌తాబ్దాన్ని అర్థం చేసుకోలేమ‌ని, భౌగోళిక‌, ఆర్థిక శక్తి, సైనిక సామర్థ్యం ఈ మూడు విష‌యాల్లోనూ భారత్ కీలక పాత్ర పోషించనుంద‌ని చెప్పారు. ఈ రెండు దేశాల మైత్రి శ‌తాబ్దాన్ని నిర్వ‌చిస్తుంది,” అని చెప్పారు.

చైనా తీరుతో అమెరికాలో క‌ల‌వ‌రం

ఇటీవ‌లి కాలంలో చైనా తీరు అమెరికాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఎస్‌సీవో ఒప్పందం, ఆర్మీ ప‌రేడ్‌ల‌తో ప‌శ్చిమ దేశాల‌కు చైనా బ‌ల‌మైన హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. భార‌త్‌పై అమెరికా ద్వితీయ సుంకాలు, భార‌త ప్ర‌ధాని మోడీ ఎస్‌సీవో స‌ద‌స్సులో పాల్గొన‌డంతో ఈ నేప‌థ్యంలో భారత్‌ను చైనా శిబిరం నుంచి పూర్తిగా తొలగించి, తమవైపు లాక్కోవ‌డం కోసం అమెరికా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు సెర్జియో మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ మేర‌కు వాణిజ్య మార్గాల్లో అవకాశాలు చూపుతూ, సరసమైన ఒప్పందాల పేరుతో అమెరికా భార‌త్‌పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. భారత్ పరిరక్షణ విధానాలను అమెరికా ఎప్పటి నుంచో విమర్శిస్తోంది. ఇవి చర్చల్లో కేంద్రంగా మార‌నున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అన్ని అంశాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌త్యేక‌ వ్యూహాన్ని అనుసరించడం ఎంతో కీలకం. చైనాను దూరంగా ఉంచాలన్న ఉద్దేశం మంచిదైనా, ఆ దిశగా భారత్ ఏ మేరకు ముందుకు వెళ్లాలో ఆలోచించి నిర్ణయించుకోవాలి. మొద‌ట్లో ట్రంప్‌, అమెరికా అధికారులు భార‌త్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినా రోజులు గ‌డుస్తున్న కొద్దీ భార‌త్‌తో మంచి సంబంధాలు కొన‌సాగించేందుకే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది.

భార‌త్‌ను చైనాకు దూరం చేస్తాం! - Tholi Paluku