
కుటుంబ కలహాలతో నలుగురు ఆత్మహత్య
తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాలోని ప్రసిద్ధ (కె ఆర్ పి) డ్యామ్ వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. కుప్పం ప్రాంతం వాసులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుప్పం జయప్రకాష్ రోడ్డు నివాసి లక్ష్మణమూర్తి (50), ఆయన భార్య జ్యోతి (40), కుమార్తె కీర్తిక (20), అత్త శారదమ్మ (70) కలిసి ఉదయం డ్యామ్ వద్దకు వచ్చారు. కుటుంబ అంతర్గత విభేదాల కారణంగా అందరూ నీటిలో దూకినట్లు అనుమానిస్తున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా స్పందించి జ్యోతి, కీర్తికలను బయటకు తీశారు. వారిని వెంటనే కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లక్ష్మణమూర్తి, శారదమ్మను రక్షించలేకపోయారు. వారు నీటిలో మునిగిపోయి మృతి చెందారని పోలీసులు ధృవీకరించారు. వైద్యులు జ్యోతి, కీర్తిక పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
