Let's talk: editor@tmv.in
జీతం చిల్లర… నోటీసు కోట్లలో

జీతం చిల్లర… నోటీసు కోట్లలో

Panthagani Anusha
13 సెప్టెంబర్, 2025

భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది చిన్నపాటి ఉద్యోగులు, కూలీలు, కార్మికులు మోసపూరిత కార్యకలాపాలకు బలవుతుంటారు. వారి పత్రాలను వాడి నకిలీ కంపెనీలు స్థాపించడం, బ్యాంకు ఖాతాలు తెరవడం తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. భిండ్ జిల్లా వాసి, వంటవాడిగా జీవనం సాగిస్తున్న రవీంద్ర సింగ్ చౌహాన్ అనే యువకుడికి ఆదాయపు పన్ను శాఖ నుంచి 46 కోట్ల నోటీసు రావడం స్థానిక ప్రజలను షాక్ గురిచేసింది.

రవీంద్ర ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఒక చిన్న ధాబాలో నెలకు రూ.8–10 వేల జీతంతో కుక్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అతని భిండ్ ఇంటికి వచ్చిన నోటీసులో అతని పేరు మీద ఉన్న ఖాతా ద్వారా రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆ నోటీసు ఇంగ్లీష్‌లో రావడంతో కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోయారు. జూలైలో మరొక నోటీసు రావడంతోనే రవీంద్రకు ఈ విషయం తెలిసింది. వెంటనే అతను పూణేలోని ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చి న్యాయవాది ప్రద్యుమ్న్ సింగ్‌ను సంప్రదించాడు.

దర్యాప్తులో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017లో టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న సమయంలో రవీంద్ర పరిచయం అయిన శశి భూషణ్ రాయ్ అనే వ్యక్తి అతని పాన్, ఆధార్ పత్రాలను వాడి బ్యాంకు ఖాతా తెరిచినట్టు తేలింది. అనంతరం 2019లో ఢిల్లీలో అదే పేరుతో శౌర్య ఇంటర్నేషనల్ ట్రేడర్స్ అనే కంపెనీని నమోదు చేశారు. ఆ కంపెనీ ద్వారా 2023 వరకు దాదాపు రూ.46 కోట్ల లావాదేవీలు సాగాయి. ప్రస్తుతం ఆ ఖాతాలో ఇంకా రూ.12.5 లక్షలు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు.

రవీంద్ర ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన రాలేదు. దీంతో అతను గ్వాలియర్ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం రవీంద్ర కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. స్థానికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “సాధారణ ప్రజల పత్రాలను దుర్వినియోగం చేయడం పెరిగిపోతోంది. ఎటువంటి విషయాల పట్ల ప్రభుత్వం, బ్యాంకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాక ఆధార్, పాన్ వంటి కీలక పత్రాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ కేసు ఆర్థిక నేరాల పర్యవేక్షణలో ఉన్న లోపాలను బహిర్గతం చేయడంతో పాటు, సామాన్య ప్రజలకు బ్యాంకు సంబంధించిన వివరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుర్తుచేస్తుంది.

జీతం చిల్లర… నోటీసు కోట్లలో - Tholi Paluku