
ప్రజల భద్రతకు తక్షణ చర్యలు
హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. పాతబస్తీ ప్రాంతమైన యాకుత్ పురాలో గురువారం ఓ చిన్నారి బాలిక స్కూల్‌కు వెళ్తుండగా, మూతలేని మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషాదకర సంఘటనపై, కమిషనర్ రంగనాథ్ మ్యాన్ హోల్ ఘటనకు హైడ్రా పూర్తిగా బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై శుక్రవారం ఉదయం ప్రాథమిక విచారణ నిర్వహించామని, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని గుర్తించామన్నారు.
ఓ చిన్నారి ప్రమాదానికి గురయ్యేంత వరకు మ్యాన్ హోల్‌కి మూత వేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని మ్యాన్ హోల్ లను ముసివేయాలి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు హైడ్రా కట్టుబడి ఉంది. మేము సర్వే నిర్వహించి నగరమంతటా మూతలేని మ్యాన్ హోల్స్ గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటాం. వర్షకాల సీజన్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా ముందుగానే ఏర్పాట్లు చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
