Let's talk: editor@tmv.in
మరో రెండు రోజులు భారీ వర్షాలు

మరో రెండు రోజులు భారీ వర్షాలు

T Venkata Ramana
13 సెప్టెంబర్, 2025

తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతో దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర సముద్రతీర ప్రాంతంలో సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు ఉపరితల చక్రవాతం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షపాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

నేడూ భారీ వర్షం

శనివారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా వాతావరణ శాఖ సూచనలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అధిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఉరుములు-మెరుపులు, ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత వారం నుంచి ఒక్క సారిగా వేడి పెరిగింది. ఉక్కపోత తో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరోసారి వర్షాలు మొదలయ్యాయి. తిరుపతి, ఏలూరు, నంద్యాల, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, గుంటూరు మొదలైన పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా చిల్లకూరులో 11.2 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా చింతలపూడిలో 10.7, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 10.5, అనంతపురం జిల్లా గుత్తిలో 9.9, కర్నూలు జిల్లా గూడూరులో 9.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.లోతట్టుప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు వాతావరణశాఖ అధికారులు సూచించారు.

మరో రెండు రోజులు భారీ వర్షాలు - Tholi Paluku