
కుల ధ్రువీకరణ పత్రాలపై నూతన మార్గదర్శకాలు
తెలంగాణ రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పోందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తిసుకుంది. ప్రజలకు త్వరగా, పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. ఇంతకు ముందు, కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసినప్పుడు, చాలా కాలం పట్టేది. మెన్యువల్ వెరిఫికేషన్, అధిక డాక్యుమెంటేషన్, తగిన సమాచారం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుండేవి. దీని వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తరచూ ఫిర్యాదులు వచ్చేవి.
గతంలో ఇలాంటి పత్రాలు పోందడనికి దరఖాస్తు చేసి ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఎమ్మర్వో అందుబాటులో లేకపోతే లేదా ఇతర పరిపాలన సమస్యల వల్ల ఈ ధ్రువీకరణ పత్రం కోసం వారం నుంచి రెండు వారాల వరకు సమయం పట్టేది. కొత్తగా కుల ధ్రువీకరణ పత్రం తీసుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ప్రతిసారి ఆమోద ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదు. పాత సర్టిఫికేట్ నంబర్ తెలిసినవారు దాని ఆధారంగా వెంటనే కొత్త సర్టిఫికేట్ పొందవచ్చు.
పాత సర్టిఫికేట్ నంబర్ తెలియకపోతే జిల్లా, మండలం, గ్రామం, ఉపజాతి, పేరు వంటి వివరాలతో శోధించి ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి సవరణలు అవసరమైతే మాత్రం జిల్లా అధికారికి ఫిర్యాదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 సెప్టెంబర్ 9 నాటి జీవో నెంబర్ 3 ప్రకారం, హిందూ ఎస్సీ వర్గం నుండి క్రైస్తవ మతంలోకి మారి బీసీ-సీ వర్గానికి చెందిన వారికి పూర్వపు ఆమోద విధానమే వర్తిస్తుంది.
కొత్త విధానం ప్రత్యేకతలు
కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో ప్రభుత్వం డిజిటల్ ఆధారిత సేవలపైనా, గ్రామ/వార్డు స్థాయిలో సర్టిఫికెట్‌ల జారీపై దృష్టిపెట్టింది. ముఖ్యమైన మార్పులు ఇవే:
మీ సేవా కేంద్రాల ద్వారా వేగవంతమైన సేవలు: అన్ని జిల్లాల్లోని "మీ సేవా కేంద్రాలు" ద్వారా దరఖాస్తులు స్వీకరించి, మీసేవ కేంద్రాల్లో నిమిషాల్లోనే పత్రాలు పొందే అవకాశం కల్పించింది.
డిజిటల్ వెరిఫికేషన్: ఆధార్, రేషన్ కార్డు, విద్యా రికార్డులు వంటి డేటాతో ఆటోమేటెడ్ వెరిఫికేషన్ జరుగుతుంది.ఇందులో ఫేక్ సర్టిఫికెట్లకు అవకాశాలు లేకుండా ఉంటుంది.
నిర్దిష్ట కాలపరిమితి : ఈ కొత్త విధానం ప్రకారం గత 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి పొందారు. పాత సర్టిఫికేట్ నంబర్ ఆధారంగా లేదా ఇతర వివరాలతో సులభంగా పొందవచ్చు. ప్రతి దరఖాస్తును 15 రోజులలో పరిష్కరించాలి అనే గడువు విధించారు
ప్రజల ప్రతిస్పందన:
కొత్త విధానాన్ని ప్రజలు సానుకూలంగా స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇకపై గ్రామంలోనే సర్టిఫికెట్ పొందవచ్చన్న విశ్వాసం ఏర్పడింది. అంతేగాక, మునుపటి లంచాల వ్యవహారాల్ని నివారించడంలో ఇది సహాయపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
