
దేవాలయాలపై దాడులు చేస్తే మరిచిపోవాలా?
హిందువులు, హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాల విషయంలో వైసీపీ నేత పేర్ని నాని అవాకులు చవాకులు పేలొద్దని బీజేపీ హితవు పలికింది. విశాఖలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి రమేష్ నాయుడు మాట్లాడుతూ హైందవ దేవాలయాలపై దాడులు జరిగితే మర్చిపోవాలంటూ దీర్ఘాలు తీస్తూ మీడియాతో మాట్లాడటం హిందువులను హేళన చేయడమేనన్నారు.
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లు ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత దీర్ఘాలు తీస్తూ మాట్లాడిన విధానం ప్రజలు అసహ్యించుకునేలా ఉందని ఎద్దేవా చేశారు. అంతర్వేది రథం దగ్దం విషయంలో హిందువులపై కేసులు పెట్టి 45 రోజుల పాటు జైల్లో పెట్టినా మరిచిపోవాలా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో గణేష్ ఉత్సవాలకు కప్పం కట్టాలంటే ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్యమం చేసిన విషయం గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వ పాలన చూసి వైసీపీ నేతలకు అసూయ వస్తోందని రమేష్ నాయుడు విమర్శించారు. పాత్రికేయుల సమావేశంలో బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇంఛార్జి కేశవ్ కాంత్, జిల్లా మాజీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
