
లోకేష్‌తో విద్యా వ్యవస్థకు ఒరిగిందేం లేదు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వల్ల విద్యా వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం లేదని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని విమర్శించారు. పది వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడమే దానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
యువగళం పాదయాత్ర హామీ విస్మరణ
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మేము అధికారంలోకి రాగానే 107,108 రద్దు చేసి వైద్య కళాశాలలలో 100 శాతం కన్వీనర్ కోటాలో అడ్మిషన్స్ చేస్తామని, పేద వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖండించారు. ఈ జాబితాలో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లి, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల,నర్సీపట్నం, పార్వతిపురం ఉన్నాయన్నారు. ఇంజినీరింగ్ విద్య అంటే కేవలం గీతం, ఎస్ఆర్ఎమ్, కేఎల్యూ, విజ్ఞాన్ పేర్లే వినిపిస్తున్నాయని ఇంటర్ విద్య అంటే నారాయణ,శ్రీ చైతన్య, భాష్యం పేర్లు గుర్తొస్తున్నాయని చెప్పారు. అలాగే ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో డిగ్రీ చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఆ కళాశాలల యాజమాన్యాలు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలో ఖాళీల భర్తీపై నిర్లక్ష్యం
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు మౌలిక వసతులు కరువయ్యాయని, అలాగే ఎంతో చరిత్ర గలిగిన యూనివర్సిటీలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అవి భర్తీ చేయడంలో చూపించని శ్రద్ధ ఇప్పుడు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో చూపటం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలను తల్లిదండ్రులు, విద్యార్థులు గమనిస్తున్నారని, వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేస్తున్న ప్రైవేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని గుంటూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శేఖర్, కోశాధికారి భవాని,సహాయ కార్యదర్శి హేమానంద్, ఉపాధ్యక్షులు కిరణ్, కార్యవర్గ సభ్యులు గ్రేస్ ప్రకాష్, నాయకులు గణేష్ పాల్గొన్నారు.
