
పల్లె కన్నీరు పెడుతుందో!
పొలం పనులు వదిలేసి పొద్దుగాల్నే సొసైటీ ముందు లైన్లో నిలబడ్డం. గంటలు గడుస్తున్నయ్...ఎండ నెత్తిమీదికొచ్చింది.... బస్తా యూరియా దొరుకుతుందో లేదో తెల్వదు. చేతికొచ్చిన పంటకు అదునుకు యూరియా అందకపోతే ఎట్టా? ఇది ఒక రైతు ఆవేదన కాదు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతన్నల నిత్య నరకయాతన. ప్రతి వానాకాలం, యాసంగి సీజన్‌లో యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక బస్తా యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఎందుకు దాపురించింది? అసలు ఈ కొరతకు కారణం ఉత్పత్తి లేకపోవడమా? లేక పంపిణీలో లోపమా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమా? ఈ ప్రశ్నల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి?
కొరతకు అసలు కారణాలేంటి?
యూరియా కొరత అనేది ఒక్క రోజులోనో, ఒక్క కారణంతోనో వచ్చింది కాదు. దీని వెనుక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వల్ల సాగునీటి లభ్యత మెరుగుపడటంతో రైతులు పెద్ద ఎత్తున వరి వంటి నీటి ఆధారిత పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పంటకు యూరియా వాడకం చాలా ఎక్కువ. పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా డిమాండ్ భారీగా పెరిగింది. కానీ ఆ పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా జరగకపోవడం కొరతకు ప్రధాన కారణం.
యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆయా సీజన్‌లకు రాష్ట్ర అవసరాలను అంచనా వేసి కేంద్రానికి ఇండెంట్ (అభ్యర్థన) పంపుతుంది. దీనిని ప్రాంతాల వారీగా నెలవారీ సరఫరా ప్రణాళిక అంటారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆ ఇండెంట్‌ను పరిశీలించి, దేశవ్యాప్తంగా ఉన్న లభ్యతను బట్టి రాష్ట్రానికి కోటాను కేటాయిస్తుంది.
అసలు సమస్య ఎక్కడ?
తెలంగాణ ప్రభుత్వం సాధారణంగా ఒక సీజన్‌కు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపుతుంది. అయితే కేంద్రం వివిధ కారణాల వల్ల 10 లక్షల మెట్రిక్ టన్నులనే కేటాయించవచ్చు. ఇక్కడే మొదటి గ్యాప్ ఏర్పడుతుంది. కేంద్రం కేటాయించిన కోటా కూడా ఒకేసారి రాదు. నెలల వారీగా, దశలవారీగా రైల్వే ర్యాకుల ద్వారా రాష్ట్రానికి చేరుతుంది. ఈ ర్యాకుల రాకలో జాప్యం జరిగితే సరిగ్గా పంటకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారు.
కృత్రిమ కొరత
కొన్నిసార్లు మార్కెట్‌లో సరిపడా యూరియా ఉన్నప్పటికీ కొందరు డీలర్లు, వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తారు. యూరియాను అక్రమంగా నిల్వచేసి, డిమాండ్ పెరిగినప్పుడు అధిక ధరలకు అమ్ముకుంటారు. ప్రభుత్వం సబ్సిడీపై బస్తాకు రూ. 266.50కి అందిస్తుంటే నల్ల బజారులో రూ. 400 నుంచి రూ. 600 వరకు అమ్ముకుంటారు. అంతేకాకుండా సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టించి ఇతర పరిశ్రమలకు తరలించడం కూడా కొరతకు ఒక ముఖ్య కారణం.
రవాణా సమస్యలు
కేంద్రం నుంచి రైల్వే ర్యాకులు రాష్ట్రంలోని రేక్ పాయింట్లకు చేరిన తర్వాత అక్కడి నుంచి జిల్లాలకు, మండలాలకు చివరికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చేరాలి. ఈ ప్రక్రియలో రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, గోదాముల్లో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా యూరియా సకాలంలో రైతుకు చేరడంలో జాప్యం జరుగుతుంది.
కేంద్రం నుంచి రావాల్సింది ఎంత?
ఇది నిరంతరం మారుతూ ఉండే అంశం. జూన్, సెప్టెంబర్ వానాకాలం సీజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి ఇండెంట్ పంపింది అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపినా, సరఫరా మాత్రం దశలవారీగానే ఉంటుంది.
వాస్తవ పరిస్థితి
జూన్, జులై సీజన్ ప్రారంభంలో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నెలకు 4 లక్షల టన్నులు అవసరమైతే కేంద్రం నుంచి 2.5 లేక 3 లక్షల టన్నులు మాత్రమే రావచ్చు. ఈ గ్యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. సరఫరాలో జాప్యం ఎందుకు జరుగుతుందంటే దేశవ్యాప్తంగా ఒకేసారి డిమాండ్ ఉండటం, అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు, దిగుమతుల్లో సమస్యలు, రవాణా ఇబ్బందులు వంటి అనేక కారణాలను కేంద్రం పేర్కొంటుంది.
గంటల తరబడి నిరీక్షణ తప్పదా?
ఒకవైపు డిమాండ్ మరోవైపు సరఫరాలో అంతరం ఉన్నప్పుడు సహకార సంఘాల వద్దకు వచ్చిన కొద్దిపాటి స్టాక్ కోసం రైతులు ఎగబడటం సహజం. ఒకరికి రెండు బస్తాలు అనే పరిమితి విధించినా, ఆ రెండు బస్తాల కోసం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూడాల్సిన దయనీయ స్థితి నెలకొంది. ఉదయం యూరియా పొందేందుకు అర్థరాత్రి నుంచే దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఇంకొందరు నిలబడలేక క్యూ లైన్లో చెప్పుులు, బస్తాలు పెడుతున్నారు. రోజు రోజుకు యూరియా సమస్య తీవ్రతరమవుతోంది. ప్రతిపక్షాలు కూడా యూరియాపై దుమ్మెత్తిపోస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదంటూ కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. అసలు సమయానికి కావాల్సిన యూరియా రాకపోతే పంటలు ఎలా పండించేందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరీక్షణలో రైతులు తమ విలువైన పనిదినాలను కోల్పోవడమే కాకుండా, మానసిక వేదనకు గురవుతున్నారు.
యూరియా కొరత అనేది కేవలం డిమాండ్, సప్లై సమస్య కాదు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం. పటిష్టమైన పంపిణీ వ్యవస్థ అక్రమాలపై ఉక్కుపాదం మోపడం ద్వారానే పరిష్కరించగలిగే సమస్య. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం సకాలంలో యూరియాను సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, నల్ల బజారును అరికట్టాలి. అదే సమయంలో రైతులు కూడా యూరియా వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ, సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ "యూరియా కన్నీళ్లు" ప్రతి సీజన్‌లోనూ అన్నదాతలను వెన్నాడుతూనే ఉంటాయి.
*భారతదేశంలో ఇంకా వ్యవసాయం మిగిలి ఉందంటే.. మన దగ్గర ఇంకా పల్లెలు పచ్చగా ఉన్నాయనే అర్ధం. అలాంటి పచ్చని నేలపై రైతన్న కష్టం నిత్యం చెమట చుక్కవుతోంది. నడిరోడ్డుపై చెప్పులరిగేలా.. ఆ చెప్పులే తమ అవసరానికి గస్తీ కాసేలా మారిన గడ్డు పరిస్థితుల్నీ చూసి పల్లె కూడా వలవల ఏడుస్తోంది. బోరున కన్నీరు పెడుతోంది. పాలకులారా? కడుపునింపే రైతన్నను. ఆ రైతన్న కాపుకాసే మనం పుట్టి పెరిగిన పల్లెను మర్చిపోకండి.
