
ఈఎంఐ ఎగ్గొడితే ఫోన్ లాక్!
ఫోన్ కొనుగోళ్ల కోసం రుణాలు తీసుకొని ఈఎంఐలు కట్టకుండా ఉడాయించే వ్యక్తులపై నియంత్రణ విధించేందుకు ఆర్బీఐ సరికొత్త నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫైనాన్స్ సంస్థలకు ఫోన్‌ను రిమోటుగా లాక్ చేసే అధికారం కల్పించే ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలిస్తోంది. ఈ తరహా చర్యల ద్వారా లోన్ తీసుకున్నా ఈఎంఐలు చెల్లించకపోవడం వంటి మోసాలను తగ్గించవచ్చని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.
వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత
ఫోన్ లాక్ చేసే క్రమంలో వినియోగదారుల హక్కులకు భంగం కలగకుండా ఫైనాన్స్ సంస్థలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాకుండా వారి నుంచి ముందస్తుగా అనుమతి తీసుకునేలా, ఫోన్‌లలో వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండేలా ప్రత్యేకమైన నిబంధనలను రూపొందించనున్నారు. ఫోన్ కొనుగోలు సమయంలోనే ఫైనాన్స్ సంస్థలు ఒక ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు సమాచారం. ఈ యాప్ ద్వారా ఈఎంఐల బకాయిలను గుర్తించి ఫోన్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా లాక్ చేయనున్నారు. అయితే, కేవలం ఫోన్‌ను లాక్ చేయడమే కాకుండా , వినియోగదారుని వ్యక్తిగత అంశాల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండాలన్నదే ఆర్బీఐ ప్రధానంగా భావిస్తోంది.
అమలైతే ఫైనాన్స్ సంస్థలకు మేలు
ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొని అమలు చేస్తే వినియోగదారులు లోన్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. వారి క్రెడిట్ బాధ్యతను గుర్తించి, ఈఎంఐలు సమయానికి చెల్లిస్తారు. ఈ విధానం ఫైనాన్స్ సంస్థలకు వసూళ్లలో భరోసాగా మారనుంది. ఇన్నాళ్లూ ఇబ్బందుల్లో నడిచిన సంస్థలు గణనీయమైన పురోగతి సాధించవచ్చు. ఇకపై లోన్ ఎగవేతలు తగ్గొచ్చని భావిస్తున్నారు. కానీ, వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై కొన్ని ఆందోళనలున్నాయి. ఇది సాంకేతికంగా ఎంతవరకు సురక్షితమన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వినియోగదారుల హక్కులు, గోప్యతకు భంగం కలగకుండా, సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉన్నప్పటికీ, ఇది అమలైతే ఫైనాన్స్ రంగంలో విప్లవాత్మక మార్పుగా భావించబడుతుంది.
