Let's talk: editor@tmv.in
ట్రంప్‌ సుంకాల‌తో ఉద్యోగాల కోత‌

ట్రంప్‌ సుంకాల‌తో ఉద్యోగాల కోత‌

Venkatesh Balusula
13 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌పై విధించిన ద్వితీయ సుంకాల ప్ర‌భావంతో ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, అమెరికా నిర్ణ‌యంతో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్ వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో రియల్ ఎస్టేట్ రంగ ఉన్నత సంస్థ క్రెడాయ్ నిర్వ‌హించిన స‌ద‌స్సులో భార‌త్, అమెరికా సంబంధాల‌పై ఉత్ప‌న్న‌మైన ప్ర‌శ్న‌ల‌పై శ‌శి థ‌రూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్థిర స్వభావంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, దౌత్యపరమైన మర్యాదలు పాటించడం లేద‌ని విమర్శించారు.

1.35 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం

అమెరికా భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించింది. ఇందులో రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు 25 శాతం జరిమానా కూడా ఉంది. ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్ తన ఎగుమతి మార్కెట్‌లను విస్తరించాలని థరూర్ సూచించారు. సూరత్‌లోని రత్నాలు, ఆభరణాల వ్యాపారంతో పాటు సీఫుడ్, తయారీ రంగాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన తెలిపారు. అమెరికా వ్యవస్థ అధ్యక్షుడికి అపారమైన స్వేచ్ఛ ఇస్తుంద‌ని, అందుకే ట్రంప్ అస్థిరంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని థ‌రూర్ విమ‌ర్శించారు.

గతంలో ఎంతోమంది అధ్యక్ష బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించినా ఏనాడు ఇలా ప్ర‌వ‌ర్తించ‌లేద‌న్నారు. ట్రంప్‌ను ప్రతి కోణంలోనూ అసాధారణ అధ్యక్షుడిగా అభివర్ణించిన థరూర్, ఆయన దౌత్యపరమైన మర్యాదలను పాటించరని తెలిపారు. "ఏ ప్రపంచ నాయకుడైనా తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని బహిరంగంగా చెప్పడం చూశారా? లేదా, ప్రపంచ దేశాలన్నీ తనను గౌరవించాలని కోరుకుంటాయని చెప్పడం విన్నారా?" అని ఆయన ప్రశ్నించారు. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయని, వాటి గతి ఏమైనా తనకు సంబంధం లేదని ట్రంప్ చెప్పడం ఏ ప్రభుత్వాధినేత నుండి వినని భాష అని థరూర్ విమర్శించారు.

అన్ని దేశాల‌పై ఒకే విధాన‌ముండాలి

అమెరికా భార‌త్‌పై మోపిన సుంకాల‌ను సుల‌భంగా కొట్టిపారేయ‌లేమ‌ని శ‌శి థ‌రూర్ వ్యాఖ్యానించారు. ఈ 25 శాతం సుంకం వల్ల ఎగుమతులు లాభదాయకం కాకుండా పోయాయన్నారు. అదనంగా రష్యా చమురు కొనుగోలుపై 25 శాతం జరిమానా సుంకం వల్ల అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులు పోటీ పడలేకపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో భారత్ తన వ్యూహాన్ని బ‌లంగా ముందుకు తీసుకెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎగుమతి మార్కెట్‌లను విస్తరించాలని ఆయన సూచించారు. అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించడం కష్ట‌మైనా సుంకాల‌ తగ్గింపు కోసం చర్చలు జరుగుతున్నాయని థరూర్ తెలిపారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఒకే విధానం ఉండాలని, చైనా ఎక్కువ చమురు దిగుమతి చేస్తున్నా భారత్‌పై మాత్ర‌మే జరిమానా విధించడం అన్యాయమని ఆయన ఆరోపించారు. ఎగుమతి మార్కెట్‌లతో పాటు రాజకీయ సంబంధాలు కూడా విస్తరించాలని థరూర్ సూచించారు. ఇటీవల యూకేతో జరిగిన వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతులను పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ చైనా ప‌ర్య‌ట‌న‌, పుతిన్ భార‌త్‌కు రానున్న నేప‌థ్యంలో ఈ మూడు దేశాల రాజ‌కీయ‌ సంబంధాలు మెరుగుపడ‌తాయ‌న్నారు.

ట్రంప్‌ సుంకాల‌తో ఉద్యోగాల కోత‌ - Tholi Paluku