
ఎమ్మెల్యేలను చోరీ చేసింది కాంగ్రెస్సే!
తెలంగాణ రాజకీయాలు మరోసారి ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంతో వేడెక్కాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల ఫొటోలను తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసి ఇది "ఎమ్మెల్యేల చోరీ" కాదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం కేటీఆర్ తాజా పోస్టుతో మరింత తీవ్రరూపం దాల్చింది.
ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు
ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెట్టి చేర్చుకుందని ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, ఫిరాయింపుల పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించడం ఈ వివాదంలో కీలక మలుపు.
టార్గెట్ రాహుల్
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసినప్పటి ఫొటోలను ఆయన షేర్ చేశారు. "ఈ ఫొటోల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లను రాహుల్ గాంధీ గుర్తు పడతారా? వాళ్లు మిమ్మల్ని ఢిల్లీలో కలిశారు కదా? ఒకవైపు ఏమో తాము పార్టీ మారలేదని ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ కండువా కాదా? దీన్ని రాహుల్ గాంధీ అంగీకరిస్తారా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఓట్ల చోరీ కంటే ఇది చిన్న నేరమా?" అంటూ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
జంప్ జిలానీలు
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మరో ఏడుగురు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ నైతిక విలువలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ చేరికలను "ప్రజాస్వామ్య హత్య"గా అభివర్ణించిన బీఆర్ఎస్ నాయకత్వం దీనిపై న్యాయపోరాటానికి దిగింది. స్పీకర్ కార్యాలయంలోనూ, ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం కీలకంగా మారింది. ఒకవేళ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తే ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.ఈ క్రమంలో కేటీఆర్ నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నించడం, ఫొటో ఆధారాలను బయటపెట్టడం ద్వారా ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో రాబోయే రోజుల్లో ఈ ఫిరాయింపుల వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
