
నేపాల్ అల్లర్లలో భారతీయ మహిళ మృతి
నేపాల్ అల్లర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ భారతీయ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన భర్తతో కలిసి ఆ మహిళ బస చేస్తున్న హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో భవనంపై నుంచి దూకి మృతి చెందింది. ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతం అవడంతో మృతురాలి స్వస్థలం ఘజియాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు నేపాల్‌లో యువత నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
భారత ఎంబసీపై కుటుంబసభ్యుల ఆరోపణలు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రాజేష్ దేవి గోలా తన భర్త రామ్‌వీర్ సింగ్ గోలాతో కలిసి సెప్టెంబర్ 7న ఖాట్మాండులో పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్లారు. సోషల్ మీడియాపై నిషేధం, పలు సమస్యల నేపథ్యంలో నేపాల్‌లో జెన్ జెడ్ ఉద్యమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న రాత్రి ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో నిరసనకారులు ఓ హోటల్‌కు నిప్పు పెట్టారు. హోటల్ సిబ్బంది అతిథులను రక్షించేందుకు తాళ్లు వాడి కిందికి దించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న భారతీయ దంపతులు మందపాటి మిద్దెలపై పడిపోయారు.
రాజేష్ కింద పడగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ, అతని భార్య తీవ్ర గాయాలపాలైంది. గందరగోళంలో సిబ్బంది భర్తను ఒకవైపు, భార్యను మరోవైపు తీసుకెళ్లారు. తీవ్ర గాయాలపాలైన నేపథ్యంలో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.అయితే బాధితుల కుటుంబ ఆరోపణ భిన్నంగా ఉంది. తన తల్లికి ప్రాథమిక చికిత్స కూడా ఇవ్వలేదని మృతురాలి కుమారుడు ఆరోపిస్తున్నారు. అత్యవసర సమయంలో భారత ఎంబసీ సాయం చేయలేదని చెబుతున్నారు. మహిల మృతదేహాన్ని రోడ్డు మార్గంలో ఘజియాబాద్ తీసుకొస్తున్నారు. ఖాట్మాండులో కర్ఫ్యూ సడలించడంతో సుప్రీం కోర్టు, బ్యాంకులు తెరుచుకున్నాయి, వ్యాపారాలు మొదలయ్యాయి.
నేపాల్‌లో భారతీయుల పరిస్థితి
నేపాల్‌లో జెన్ జెడ్ నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఆందోళనలు భారతీయులను కలవరపరుస్తున్నాయి. నేపాల్‌లో ఈ ఆందోళనల్లో 51 మంది మరణించారు. దేశ ప్రధాని, హోం మంత్రి రాజీనామా చేశారు. ఖాట్మాండులో కర్ఫ్యూ వల్ల భారత్‌తో పాటు, ఇతర దేశాల పర్యాటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. భారతీయ పర్యాటకుల బస్సులపై దాడులు జరిగాయి. హోటళ్లు ధ్వంసమయ్యాయి. ఒక భారతీయుడు తన క్యాబ్‌పై దాడి గురించి చెప్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. చాలామంది స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఎంబసీ సాయం లేకపోవడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గురువారం ఏపీకి చెందిన 144 మంది పర్యాటకులు సురక్షితంగా విమానంలో స్వస్థలానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దేశ పౌరులందరినీ క్షేమంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది.
