
మెగా డ్రీమ్స్‌తోనే ఏదైనా సాధ్యం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వే2 న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొని, దశాబ్ద కాలంలో రాష్ట్రం ఎలా మారుతుందనే అంశాన్ని వివరించారు. స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేసుకుని ఈ కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్న చంద్రబాబు, విజన్ రూపకల్పన చేయడమే కాకుండా దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాలని అందరినీ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో 'వికసిత్ భారత్-2047', రాష్ట్ర స్థాయిలో 'స్వర్ణాంధ్ర-2047' విజన్ సిద్ధం చేశామని చెప్పుకున్నారు. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజంగా మలచాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.
ఆర్థిక సంస్కరణలతో అన్ స్టాపబుల్
20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేసిన చంద్రబాబు, అప్పటి నుంచి దేశ అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా మారిందని అన్నారు. 2038 నాటికి భారత్ నెంబర్-1 అవుతుందని, ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పుకున్న చంద్రబాబు, గత ఏడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామని పేర్కొన్నారు. 2028-29 నాటికి రూ. 29,29,402 కోట్ల మేర జీఎస్‌డీపీ సాధిస్తామని, 2029-2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్‌డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించే బాధ్యత ఎన్‌డీఏ కూటమి తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
తలసరి ఆదాయం డబుల్
2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ. 5,42,985కి చేర్చుతామని, 2029-2034 నాటికి రూ. 10,55,000 సాధించగలమని చంద్రబాబు నాయుడు ధైర్యంగా ప్రకటించారు. ఇదేమీ అసాధ్యం కాదని, నిర్థిష్టమైన ఆలోచనతో ప్రణాళికలు వేశామని చెప్పుకున్నారు. మెగా డ్రీమ్స్ ఉండాలి, సంకల్పం ఉండాలి... అప్పుడే సాధ్యమని ఆయన అందరినీ ప్రోత్సహించారు. విజన్ 2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్‌పై అనుమానాలు పెట్టకూడదని సూచించారు. భారత్‌లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నామని, అభివృద్ధికి అదే తరహాలో నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.
రాజకీయాలు ముఖ్యమే
రాజకీయాలు ముఖ్యమే కానీ, సమాజం గురించి కూడా ఆలోచించాలని చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు, విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావని ఉదాహరణలు ఇచ్చారు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలని అన్నారు. 1994లో కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, 1999లో గెలిచానని గుర్తు చేసుకున్న చంద్రబాబు, 1999లో ప్రభుత్వం వచ్చాక ఓ తపనతో పని చేశాను కానీ కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయానని అంగీకరించారు. కానీ ఇప్పుడు పూర్తి బ్యాలెన్స్ చేస్తున్నామని, సంపద సృష్టి చేస్తూ పేదలకు అందిస్తున్నామని చెప్పారు. నాలుగోసారి కూడా మోదీనే వస్తారు, రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే వస్తుందని, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ధైర్యంగా ప్రకటించారు.
మూడేళ్లలో అమరావతి
ప్రపంచంలో వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని, సుస్థిరతకు, నాయకత్వానికి మారు పేరు భారతదేశమేనని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రిని తానేనని గర్వంగా చెప్పుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై ఫోకస్ పెట్టానని, హైదరాబాద్‌కు ఉన్న అడ్వాంటేజ్‌ల కారణంగా ఎక్కువగా అభివృద్ధి చెందిందని వివరించారు. ఇప్పుడు విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని రాబోయే మూడేళ్లలో పూర్తి అవుతుందని, రూ. 50 వేల కోట్ల విలువైన ఇన్‌ఫ్రా అందుబాటులోకి వస్తుందని, పూర్తి అయిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు.
అమరావతి రైతులకు అన్యాయం జరగదు
2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని విమర్శించిన చంద్రబాబు, మళ్లీ అధికారం చేపట్టాక పోలవరంపై ఫోకస్ పెట్టామని, కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. 2027 సెప్టెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరు ఇచ్చామని, హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు 100 రోజుల్లో పూర్తి చేసి నీరు అందించామని ఉదాహరణలు ఇచ్చారు. ప్రజల్లో రకరకాల వాళ్లు ఉంటారు, అందరూ అన్ని అందిపుచ్చుకోలేరు... అందుకే రకరకాల పబ్లిక్ పాలసీలు తీసుకుంటామని వివరించారు.
ఆ పాలసీలు పబ్లిక్ సెంట్రిక్‌గా తీసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వానిదని చెప్పారు.అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములేనని, హైటెక్ సిటీ రాకముందు హైదరాబాద్ ఎకరం రూ. లక్ష ఉండేది... ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరిందని ఉదాహరణ ప్రస్తావించారు. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుందని, అమరావతి రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి కంటిన్యూగా ఉంటుందని, అభివృద్ధిని పరిమితం చేస్తే చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందని హెచ్చరించారు. హైదరాబాద్ తరహాలో అమరావతి మహానగరంగా మారుతుందని, గుంటూరు-విజయవాడ-తెనాలి-గ్రామాలు కలిస్తేనే అది సాధ్యమని చెప్పారు. భూములిచ్చిన వారిని ఆదుకుంటామని, విస్తరణలో ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఉన్న భూమి సరిపోతుందని, అవసరమైతే రైతులతో మాట్లాడి ముందుకు తీసుకువెళ్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామని, క్వాంటం కంప్యూటింగ్‌కు అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని రాబోతున్నాయని తెలిపారు. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరువు ఉండేదని, ట్యాంకర్లలో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేసుకున్నారు. అనంతపురం దేశంలో అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అయినప్పటికీ, నీళ్లు అందించడంతో పరిస్థితి మారిందని, కోస్తా జిల్లాల కంటే అక్కడే జీఎస్‌డీపీలో టాప్ పొజిషన్ ఉందని చెప్పారు. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యమని వివరించారు.
నీళ్లు లేకపోయినా, రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే మనం ఇక్కడే ఉంటామని, పైగా వృధా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగిస్తామని చెప్పడం సరికాదని విమర్శించారు. పెద్ద సంస్థలు సొంత డబ్బులతో పెడుతున్నాయా... బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయని ఉదాహరణలు ఇచ్చారు. ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోందని చెప్పారు. చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతో ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టకుండా... కట్టేశామని చెప్పడం సరికాదని విమర్శించారు. మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు... పీపీపీ పద్ధతినే నిర్మాణం చేపడుతున్నామని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. నిర్వహణ ప్రభుత్వానిదేనని తెలిపారు. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిదని చెప్పారు. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదని హెచ్చరించారు.
