
మళ్లీ అధికారంలోకి వస్తామో, లేదో!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ‘నేను ప్రజలకు ఎక్కువగా హామీలు ఇవ్వలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు’ అంటూ తాజాగా మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు బలంగా చేకూర్చేలా జూపల్లి మాట్లాడటం గమనార్హం. ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడారో.. ఏ సందర్భంలో వ్యాఖ్యానించారో తెలియదు కానీ ఈ కామెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయాలను, ప్రభుత్వ పనితీరును సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. అయితే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు సర్దిచెప్తున్నాయి. కానీ మంత్రిగా ఉన్న నేతే ఇలా మాట్లాడటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జూపల్లి కృష్ణారావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన నేత కావడం గమనార్హం.
ఎక్కడ, ఏ సందర్భంలో..
ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, "వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. అందుకే హామీలు ఇవ్వదలుచుకోలేదు" అని ఆయన అన్నారు. "నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. నా జేబుల నుంచి ఇచ్చేటివి ఏమైనా ఉంటే ఇస్తా అని చెప్తా. మరి ఎవరో వచ్చేదానికి మోసపు మాట అయితది కాబట్టి హామీ ఇవ్వను" అని ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ప్రజలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యమా?
మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి, 2023లో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, సొంత ప్రభుత్వ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం. ఆయన వ్యాఖ్యలు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయకూడదనే నిజాయితీతో వచ్చాయా? లేక పార్టీలో అసంతృప్తి ఉందా? అన్నది ప్రశ్నార్థకం. "ప్రస్తుతం మీరు అడిగిన వాటన్నింటికి ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా" అని పేర్కొన్నారు. ఇది ఒకవైపు నిజాయితీగా కనిపించినా, మరోవైపు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. ఇటువంటి సమయంలో సొంత మంత్రి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. విపక్షాలు ఈ వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని, "కాంగ్రెస్ మళ్లీ గెలిచేది లేదని క్లియర్ గా చెప్తున్న మంత్రి జూపల్లి" అని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ వంటి విపక్షాలు దీన్ని "కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది" అని విమర్శిస్తున్నాయి. మరోవైపు, ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతాయి, ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక సమస్యలు, హామీల అమలు ఆలస్యం వంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దుమారం రేపుతున్న వ్యాఖ్యలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జూపల్లి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్ట్‌లో, "కాంగ్రెస్ మళ్లీ గెలిచేది లేదని క్లియర్ గా చెప్తున్న మంత్రి" అని విమర్శలు వచ్చాయి. మరికొందరు, "ఇది నిజాయితీపరమైన మాటలు, ప్రజలను మోసం చేయకుండా చెప్పారు" అని సమర్థిస్తున్నారు. ప్రజల్లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు ఆయనను "స్వచ్ఛమైన రాజకీయవేత్త" అంటుంటే, మరికొందరు "పార్టీకి ద్రోహం చేస్తున్నారు" అని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు ఎన్నికలకు ముందు పార్టీకి సవాలుగా మారవచ్చు.
అసంతృప్తి ఉందా? లేక రాజకీయ వ్యూహమా?
గతంలో బీఆర్ఎస్‌లో ఉండి కాంగ్రెస్‌లో చేరిన ఆయన, ప్రభుత్వ పాలనలో ఏవైనా లోటుపాట్లు చూసి అసంతృప్తి చెందారా? లేక తన నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాలనుకున్నారా? అన్నది ప్రశ్న. ఇది రాజకీయ వ్యూహంగా కూడా ఉండవచ్చు. ప్రజలకు దగ్గరవ్వడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో, ఇతర సమయాల్లోనూ ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇవ్వడం.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం సహజమే. అయితే చాలా మంది అధికారంలోకి వచ్చాక ఆ హామీలను చాలా తేలిగ్గా పక్కన పెడుతుంటారు. కానీ జూపల్లి మాత్రం ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వడం ఇష్టం లేక ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? లేదంటే ప్రభుత్వం మీద, పార్టీ మీద ఉన్న అసంతృప్తిని ఈ రూపంలో వ్యక్తపరిచారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
