
కర్ణాటకలో మరోసారి కులగణన
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కులగణన చేయబోతున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఓ ప్రకటన చేశారు. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 7 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతంలో 2015లో చేపట్టిన కులగణన నివేదికను అంగీకరించబోమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, పదేళ్ల కిందటి డేటా ప్రస్తుత సమాజ వాస్తవాలను ప్రతిబింబించదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను కూడా అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. కర్నాటకలో కూడా ఇదే తరహా వ్యూహం అవలంభించి బీసీ కులాలను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్రంలో అసమానతలు
రాష్ట్రంలో అనేక కులాలు, మతాలు, సామాజిక అసమానతలు ఉన్నాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘అసమానతలను తొలగించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేయడానికి ఈ కొత్త సర్వే ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సర్వేకు రూ.425 కోట్లు కేటాయించారు. సుమారు 1.65 లక్షల మంది ఎన్యూమరేటర్లు 7 కోట్ల మంది జనాభాకు కులగణన చేయబోతున్నారు. కులంతోపాటు ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం, భూమి హోల్డింగ్, ఉద్యోగాలు వంటి అదనపు సూచికలను కూడా సేకరిస్తారు. డిసెంబరు 2025 నాటికి ఫైనల్ నివేదిక రానుంది.
గతంలో ఏం జరిగింది?
2015లో కర్నాటకలో వెనకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంతరాజు నేతృత్వంలో కులగణన చేపట్టింది. ఆ డేటా ఆధారంగా జయప్రకాశ్ హెగ్డే కమిషన్ 2024లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. అయితే, ఈ నివేదికపై కొన్ని అగ్రవర్ణ కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. లింగాయత్, వొక్కలిగా సముదాయాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. తమ కులాలను పరిగణనలోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. సర్వేలో లోపాలున్నాయని వాదించాయి. లింగాయత్ మహాసభా నివేదికను తిరస్కరించి, కొత్త సర్వే చేయాలన్న డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం గత నివేదికను అమలు చేయకుండా మరోసారి సర్వేకు మొగ్గు చూపింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ సూచన చేసినట్టు సమాచారం.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఈ సర్వే సామాజిక న్యాయానికి కీలకంగా మారబోతున్నదని కర్నాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అసమానతలు కొనసాగుతున్నాయని, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి
మరోసారి కులగణన చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. వెనకబడిన వర్గాల నుంచి తమకు మద్దతు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. లింగాయత్, వొక్కలిగాలు తమ ప్రాబల్యాన్ని తగ్గించి, రిజర్వేషన్లలో నష్టం కలిగించవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. . బీజేపీ నేత అశోక్ కేఎమ్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలు చెల్లించే డబ్బు లేదు, మరి ఇంత ఖర్చుతో సర్వే ఎందుకు?’’ అని ప్రశ్నించారు.
