Let's talk: editor@tmv.in
మహిళా రైతును కించపరుస్తారా?

మహిళా రైతును కించపరుస్తారా?

Aravind Maryada Reddy
13 సెప్టెంబర్, 2025

ఏ అంశం మీదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనా రనౌత్ ముందుంటారు. గతంలో ఆమె పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. రైతుల ఉద్యమం జరిగినప్పడు ఓ మహిళా రైతును ఉద్దేశించి కంగనా చేసిన కామెంట్లు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. సదరు మహిళా రైతు కంగనా రనౌత్ మీద పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు తాజాగా కోర్టు ఎదుటకు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు స్పందిస్తూ కంగనా రనౌత్ మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మహిళా రైతును ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నది. కంగనా కేవలం రీట్వీట్ చేశారని ఆమె తరఫు న్యాయవాదులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. కంగనా రనౌత్ కేవలం రీ ట్వీట్ చేయలేదని.. ఆమె తన సొంత వ్యాఖ్యానాలు కూడా జోడించిందని సుప్రీంకోర్టు మండిపడింది.

అసలు వివాదం ఏమిటి?

2021లో రైతుల ఆందోళన సందర్భంగా వృద్ధ మహిళ మహిందర్ కౌర్‌ను కించపరిచిన రీట్వీట్‌పై నమోదైన క్రిమినల్ డిఫమేషన్ కేసును కొట్టివేయాలంటూ కంగనా రనౌత్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ ను కొట్టేసింది. 'మీరు సింపుల్‌గా రీట్వీట్ చేయలేదు, మీ సొంత కామెంట్లు జోడించి మసాలా పెట్టారు' అంటూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కంగనా తన పిటిషన్‌ను ఉపసంహరించుకుని ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కోర్టు సూచించింది. 73 ఏళ్ల మహళా రతు మహిందర్ కౌర్ 2021 డిసెంబర్‌లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఈ మహిళను ఉద్దేశించి కంగనా 'ఆమె రూ.100 కిరాయికి వస్తుంది' అనే అనుచిత కామెంట్‌ చేశారు. దీంతో అప్పట్లో తీవ్ర వివాదమైంది. ముందుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా పిటిషన్‌ను ఆ కోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆమె తరఫు న్యాయవాది 'ఇది కేవలం రీట్వీట్ మాత్రమే' అని వాదించగా, ధర్మాసనం 'మీ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి? మీరు మీ సొంత మసాలా జోడించారు' అంటూ ఘాటుగా తిట్టారు. కంగనా తరఫు న్యాయవాది ఆ రీట్వీట్‌పై క్లారిఫికేషన్ ఇచ్చామని చెప్పగా, 'ఆ క్లారిఫికేషన్‌ను ట్రయల్ కోర్టులో ఇవ్వండి' అని సూచించింది కోర్టు. పంజాబ్‌లోని ట్రయల్ కోర్టుకు వెళ్లలేనని న్యాయవాది వాదించగా, వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరవచ్చని కోర్టు స్పష్టం చేసింది. చివరగా 'మీ ట్వీట్‌పై మా స్పందనను మార్చడానికి ప్రయత్నం చేయకండి' అంటూ ధర్మాసనం మరోసారి హెచ్చరించింది.

అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు

కంగనా రనౌత్ 2020లో సుషాంత్ సింగ్ రాజపుత్ మరణానంతరం బాలీవుడ్‌లో '99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారు' అని కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. 2024 ఆగస్టులో మళ్లీ రైతుల ఆందోళనకు 'విదేశీ శక్తులు వెనుక ఉన్నాయి' అని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. 1947 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 'అది భిక్షాటన మాత్రమే' అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ఈ తాజా ఘటన కంగనా రనౌత్‌కు రాజకీయ, సినిమా రంగాల్లో మరోసారి సవాలుగా మారింది. ట్రయల్ కోర్టులో కేసు ఎలా సాగుతుందో చూడాలి. ఈ కోర్టు కేసులతోనైనా కంగనా రనౌత్ మారతారా? లేదంటే ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? అన్నది వేచి చూడాలి.

మహిళా రైతును కించపరుస్తారా? - Tholi Paluku