
దేశంలో ఉగ్రవాద కుట్ర భగ్నం
దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించిన ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రట్టు చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని విచారణలో వెల్లడవుతోంది. గత వారం రోజులుగా అరెస్టయిన ఐదుగురు ఉగ్రవాదులను లోతుగా విచారిస్తున్న కొద్దీ దేశం ఉలిక్కిపడే నిజాలు బయటకొస్తున్నాయి. కేవలం బాంబు పేలుళ్లే కాదు దేశంలోని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు సైతం వీరు సిద్ధమైనట్లు తెలియడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పండుగల సీజన్‌లో రద్దీగా ఉండే నగరాలే లక్ష్యంగా రక్తపాతం సృష్టించాలన్న వీరి భారీ కుట్రను భగ్నం చేయడం ద్వారా భద్రతా బలగాలు పెను ప్రమాదాన్ని నివారించాయి.
విస్తుపోయే నిజాలు
గత వారం రోజులుగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల అధికారులు అరెస్టు చేసిన డానీష్, అఫ్తాబ్, సుఫీయాన్, హుజైఫా యామన్, ఖమ్రాన్ ఖురేషీలను విచారిస్తున్నారు. వీరి విచారణలో వెల్లడైన అంశాలు అధికారులనే నివ్వెరపరిచాయి. వారు పన్నిన పన్నాగాలు వింటే దేశం నివ్వెరపోవాల్సిందే.
టార్గెట్ లిస్ట్ సిద్ధం
ఈ ముఠా దేశంలోని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ఒక నిర్దిష్ట మతానికి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకుంది. వారి కదలికలను గమనిస్తూ వారిపై ఆత్మాహుతి దాడికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు ప్రధాన సూత్రధారి డానీష్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. వారెవరెవరు అనే వివరాలను కూడా వారి నుంచి పోలీసులు రాబడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సదరు నాయకులకు కూడా భద్రతను పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే పోలీసులు కొంత వరకు సమాచారం తెలిసినప్పటికి వాటికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించడం లేదు.
మహానగరాలే లక్ష్యం
ఢిల్లీ, ముంబై , పూణే, హైదరాబాద్ వంటి మహానగరాల్లో పండుగల సమయంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలను వీరు టార్గెట్ చేశారు. ఒకేసారి పలుచోట్ల పేలుళ్లు జరిపి దేశంలో భయోత్పాతం సృష్టించాలని పాక్‌లోని హ్యాండ్లర్లు ఆదేశించినట్లు తెలిసింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పట్టుబడిన హుజైఫా యామన్, స్థానికంగా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. మతతత్వ ప్రసంగాలతో వారిని రెచ్చగొట్టి స్లీపర్ సెల్స్‌గా మార్చే బాధ్యతను ఇతను తీసుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ఉగ్రవాదులు దేశరాజధానిలోొని ఢిల్లీని, తెలంగాణలోని హైదరాబాద్ నే టార్గెట్ చేస్తుంటారు. గతంలోనూ లుంబీని పార్క్ జంటబాంబు పేలుళ్లు, మక్కా మసీదులో బాంబు పేలుడు, దిలుసుఖ్ నగర్ లోని సాయిబాబా గుడి సమీపంలో జరిగిన ఘటనలన్నీ ఉగ్రవాదులు పన్నిన కట్రనేనని తేలింది. ఇక దసరా పండుగ రోజు జనం బిజీబిజీగా ఉన్నసమయంలో పోలీసులు కూడా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో ఏకంగా ఉగ్రవాదులు టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్నే టార్గెట్ చేశారు. దసర పండుగరోజు రాత్రి ఏడుగంటల సమయంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే బాంబులు పేల్చారు. ఇలా ఉగ్రవాదులు ఎక్కువగా హైదరాబాద్ ను టార్గెట్ చేస్తున్నారు.
ముఠా ప్రణాళికలు
ఈ ముఠా అత్యంత పకడ్బందీగా, ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ తమ కార్యకలాపాలను సాగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పగటిపూట సాధారణ పౌరుల్లా చిన్నచిన్న పనులు చేసుకుంటూ ప్రజల్లో కలిసిపోయేవారు. కానీ తెర వెనుక మాత్రం ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఒకచోటి నుంచి మరోచోటికి చేరవేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు.
ఇందుకోసం పాక్‌లోని తమ హ్యాండ్లర్లతో మాట్లాడేందుకు తమ నెట్‌వర్క్‌లోని 40 మంది సభ్యులతో సమాచారం పంచుకునేందుకు వీరు 'సిగ్నల్' వంటి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న యాప్‌లను ఉపయోగించారు. దీంతో వీరి సంభాషణలను ట్రేస్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఆన్‌లైన్‌లో శిక్షణ
బాంబులు, ఆత్మాహుతి జాకెట్లు, రసాయన ఆయుధాల తయారీలో వీరికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఐఈడీల తయారీకి అవసరమైన ముడి పదార్థాలైన హైడ్రోక్లోరిక్, నైట్రిక్ ఆమ్లాలు, సల్ఫర్ పౌడర్‌ను స్థానికంగానే సమకూర్చుకున్నారు. గత ఆరు నెలలుగా నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ఢిల్లీ స్పెషల్ సెల్, దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టింది. సరైన ఆధారాలు లభించగానే వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డానీష్‌ను జార్ఖండ్‌లోని రాంచీలో పట్టుకున్నారు. ముంబయికి చెందిన అఫ్తాబ్, సుఫీయాన్‌లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఖమ్రాన్ ఖురేషీని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఏటీఎస్ సహకారంతో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో హుజైఫా యామన్‌ను అరెస్ట్ చేశారు.
లోతైన విచారణ
ప్రస్తుతం ఈ ఐదుగురు పోలీసుల కస్టడీలో ఉన్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లలోని డేటాను విశ్లేషించడం ద్వారా ఈ నెట్‌వర్క్‌లోని మిగతా సభ్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దేశంలో ఇంకా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, వారి తదుపరి ప్రణాళికలు ఏమిటనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ అరెస్టులతో దేశం ఒక పెను ముప్పు నుంచి బయటపడినప్పటికీ ఉగ్రవాద ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
