
భారత పర్యటనకు ఆరోన్ హార్డీ దూరం
భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ భుజం గాయం కారణంగా భారత పర్యటన నుంచి తప్పుకున్నారు. ఈ పర్యటనలో ఆసీస్ జట్టు భారత ‘ఏ’ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. హార్డీ స్థానంలో విక్టోరియా ఆల్ రౌండర్ విల్ సదర్లాండ్ జట్టులోకి వచ్చారు. సదర్లాండ్ ఇప్పటికే ఆస్ట్రేలియా వన్డే జట్టులో ఉన్నాడు. ఇప్పుడు లక్నోలో జరిగే టెస్ట్ మ్యాచ్ల కోసం భారతదేశానికి రానున్నాడు. వన్డే జట్టులో హార్డీకి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడి పేరు త్వరలో ప్రకటిస్తారు.
హార్డీ ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్లలో ఆడాడు. కానీ దక్షిణాఫ్రికాతో అంతగా రాణించలేకపోయాడు. దీంతో మూడు టీ20ల కోసం న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. బదులుగా 'ఏ' జట్టులో చోటు సంపాదించాడు. హార్డీ కోలుకునే తీరును బట్టి, భవిష్యత్తులో భారత్తో జరిగే వైట్-బాల్ సిరీస్లలో అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాకు గాయాల బెడద
ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది. యాషెస్ సిరీస్కు ముందు వెన్ను గాయం నుంచి ప్యాట్ కమిన్స్ కోలుకుంటాడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. హార్డీతో పాటు లాన్స్ మోరిస్ వెన్ను శస్త్రచికిత్స కారణంగా 12 నెలలు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అలాగే యువ ఆటగాడు కల్లమ్ విడ్లర్కు స్ట్రెస్ ఫ్రాక్చర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మోరిస్ నాలుగు రోజుల 'ఏ' టూర్లో, విడ్లర్ వన్డేలలో ఆడాల్సి ఉంది. మోరిస్కు బదులుగా మొదట బ్రోడీ కౌచ్ను తీసుకున్నారు. కానీ ఆయన టాప్ ఎండ్ T20 ఫైనల్లో గాయపడటంతో, సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన హెన్రీ థోర్న్టన్ను ఎంపిక చేశారు. ఇండియా 'ఏ' జట్టుతో తొలి అనధికార టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 16న, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి. మూడు వన్డేలు కాన్పూర్లో సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో జరుగుతాయి.
ఆస్ట్రేలియా 'ఏ' టెస్టు జట్టు
జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, క్యాంప్బెల్ కెల్లావే, శామ్ కొన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గుస్ ఓ'నీల్, ఆలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్, విల్ సదర్లాండ్ (రెండో మ్యాచ్కు మాత్రమే), హెన్రీ థోర్న్టన్.
ఆస్ట్రేలియా 'ఏ' వన్డే జట్టు
కూపర్ కొన్నోలీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, శామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, మెకంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, లాచి షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్ (ఒకరిని త్వరలో చేరుస్తారు).
