
మార్స్పై జీవం!?
మార్స్పై జీవం ఉందా అనే ప్రశ్న మానవజాతిని శతాబ్దాలుగా వేధిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికే దారిలో ఒక కొత్త వెలుగును నాసా పరిశోధకులు చూపించారు. జెజెరో క్రేటర్ ప్రాంతంలో పర్సివీరెన్స్ రోవర్ సేకరించిన రాళ్లలో జీవానికి సంబంధించిన గుర్తులు ఉండొచ్చని తాజా పరిశోధన చెబుతోంది. ఇది భూమి వెలుపల జీవం ఉందని చెప్పడానికి అత్యంత బలమైన ఆధారమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2024లో 'ఫాల్స్' అనే ప్రాంతంలో 'సాఫైర్' అనే రాయి నమూనాను రోవర్ సేకరించింది. ఈ రాయి పరిశీలనలో సూక్ష్మజీవుల యాక్టివిటీని సూచించే రసాయనిక, నిర్మాణాత్మక లక్షణాలు బయటపడ్డాయి. వీటిని 'బయోసిగ్నేచర్స్'గా పిలుస్తారు. అంటే జీవ వృత్తిలోనే ఏర్పడే నిర్మాణాలు లేదా పదార్థాలు అన్నమాట. అయితే, ఇది నిజంగా జీవానికి ఆధారమని చెప్పే ముందు మరింత లోతుగా పరీక్షలు జరగాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
'బ్రైట్ ఏంజెల్' అనే ప్రాచీన నది ప్రవాహ మార్గాన్ని పరిశీలిస్తున్నప్పుడు రోవర్ ఈ రాళ్లను కనుగొంది. పిక్సెల్, షెర్లాక్ పరికరాలతో చేసిన పరిశీలనలో ఐరన్ ఆధారిత రెండు ఖనిజాలు ఒకే చోట కనిపించాయి. భూమిపై ఇవి సాధారణంగా సూక్ష్మజీవుల యాక్టివిటీతో అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఆ రాళ్లలో భారీ స్థాయిలో కార్బన్, సల్ఫర్, ఫాస్పరస్ లాంటి మూలకాలు కనిపించాయి. ఇక ముఖ్యంగా, ఈ ఖనిజాలు సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు లేదా ఆమ్లతా వాతావరణంలో ఏర్పడతాయి. ఇటు ఇప్పటివరకు రోవర్ 27 రాళ్ల నమూనాలను సేకరించింది. వీటిని భవిష్యత్తులో జరగబోయే మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్ ద్వారా భూమికి తీసుకొస్తారు. అక్కడి ల్యాబ్లలో జరిగే విశ్లేషణలతో ఈ విశ్వంలో మనం ఒంటరివారమా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
మరోవైపు మార్స్లో జీవం ఆనవాళ్లు గుర్తించారనే వార్త మానవ జాతిని కొత్త ఆలోచనల దిశగా నడిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక శాస్త్రీయ పరిశోధన ఫలితం మాత్రమే కాదు, మన భవిష్యత్తును మార్చే తత్వశాస్త్రీయ ప్రశ్నలకూ సమాధానం కావచ్చు. ఈ విశ్వంలో మనమే ఒంటరిగా ఉన్నామా? లేకపోతే జీవం అనేది విశ్వం అంతటా వ్యాపించి, వేర్వేరు రూపాలలో దాగి ఉందా? అనే శతాబ్దాల ప్రశ్నకు మార్స్ సమాధానం ఇవ్వబోతుందనే భావన కలుగుతోంది. మనిషి అంతరిక్ష అన్వేషణ మొదలుపెట్టినప్పటి నుంచి చంద్రుడి మీద కాలుమోపడం ఒక కల అయితే, మార్స్పై జీవం వెతకడం మరో కలగా మారింది. ఈ రోవర్ కనుగొన్న నమూనా మనల్ని ఆ కలకి దగ్గరగా తీసుకెళ్తోంది. జీవానికి సంబంధించిన రసాయనాలు, ఖనిజాలు, నిర్మాణాలు భూమిపై ఉన్నవాటితో పోలి ఉండటం మానవజాతికి ఒక ఆశ్చర్యంగానే చెప్పాలి.
దీని ప్రకారం చూస్తే ఇకపై అంతరిక్ష అన్వేషణ కేవలం శాస్త్ర సాంకేతిక ప్రయాణం కాదు, అది నైతిక విలువలతో కూడిన ఒక చర్చగా మారబోతోంది. ఒకవేళ మార్స్లో నిజంగానే సూక్ష్మ జీవులు ఉన్నాయనుకోండి. అప్పుడు మనం వాటిని 'పరిశోధన కోసం నమూనాలు'గా మాత్రమే చూడాలా, లేదా 'ప్రకృతి సృష్టించిన ప్రత్యేక జీవ రూపాలు'గా గౌరవించాలా అనేది కూడా పెద్ద ప్రశ్నేనండి. ఎందుకంటే, ఒక కొత్త జీవరాశిని కనుగొన్న వెంటనే దాన్ని పరీక్షల కోసం నాశనం చేయడం, మనిషి అధికారం పేరుతో ప్రకృతిని మళ్లీ మోసం చేయడమే అవుతుంది. అదే సమయంలో, జీవం మార్స్పై ఎప్పుడో ఒకప్పుడు వికసించి తర్వాత నశించిపోయిందనుకుంటే, అది భూమిపై మనిషికి ఒక హెచ్చరిక లాంటిది. నిజానికి ఒక గ్రహంలో జీవం పుట్టడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. కాలక్రమంలో వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు లేదా అంతరిక్ష ఘటనల వల్ల జీవం నశించవచ్చని ఇది చూపిస్తుంది. ఇది మన భూమిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది. మొత్తానికి, రోవర్ కనుగొన్న రాయి కేవలం ఒక శాస్త్రీయ నమూనా కాదు. అది మానవ చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ విశ్వంలో మనం ఒంటరివారమా? లేదా విశ్వం అంతటా జీవం అనేది సర్వసాధారణమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే మార్గంలో పడిన పెద్ద అడుగుగా చెప్పవచ్చు.
