
అంటార్కటికా నీడలో భారత వర్షాలు
ఇండియాలో వర్షాకాలానికి అంటార్కటికా అనే మంచు ఖండంతో సంబంధం ఉందని మీరెప్పుడైనా అనుకున్నారా? భారత్లో వర్షం కురుస్తుంటే, దూరంగా వేల మైళ్ల దూరంలో ఉన్న మంచు భూమి ఆకాశాన్ని తాకేలా ప్రభావం చూపుతుందని ఊహించగలరా? ఎంత ఆశ్చర్యం కదా! ఈ రహస్యాన్ని కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. 34 మిలియన్ల ఏళ్ల క్రితం అంటార్కటికాలో మంచు పర్వతాలు మొదలయ్యాయి. ఆ మంచు పెరుగుదలతో భూమి వాతావరణంలో మార్పులు చెలరేగాయి. గాలి, వర్షాల దిశలు మారిపోయాయి. అదే సమయంలో ఈశాన్య భారతంలో, ముఖ్యంగా నాగాలాండ్ ప్రాంతంలో, మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. అంటే అంటార్కటికాలో మంచు పెరిగితే, మన నాగాలాండ్లో వర్షం కురిసిందట.
నాగాలాండ్ లైసోంగ్ ప్రాంతంలో ఒక ఫాసిల్ దొరికింది. ఇది వాతావరణాన్ని చెప్పగలిగింది. శాస్త్రవేత్తలు ఆ ఫాసిల్ను చూసి, దాని ఆకారం, పరిమాణం లాంటి వాటిని విశ్లేషించారు. ఈ రీసెర్చ్ ప్రకారం అప్పట్లో నాగాలాండ్ చాలా వేడిగా ఉండేదట.. కొన్ని సందర్భాల్లో మాత్రం వరదలు వచ్చే లెవల్లో వర్షాలు కురుస్తూ ఉండేవట. లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాలియో సైన్సెస్, డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సైంటిస్టుల కనుగొన్న మరో గొప్ప విషయమేమిటంటే, అంటార్కటికాలో మంచు పెరిగినప్పుడు, వర్షపు పట్టీ కాస్త కిందకి జారిపోయింది. దీనికారణంగా వర్షాలు కొత్త ప్రదేశాల్లో పడటం మొదలయ్యాయి. అప్పుడు ఆ వర్షపు పట్టీ ఈశాన్య భారతం దగ్గరకి చేరింది. అందుకే అక్కడ మునుపెన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. నిజానికి భూమి చుట్టూ ఒక పెద్ద వర్షపు పట్టీ ఉంటుంది. ఆ పట్టీ పేరు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్స్ జోన్. ఈ పట్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయి.
ఇక ఈ పరిశోధనలో మరో మలుపు కూడా ఉంది. ఇదంతా గతానికి మాత్రమే కాకుండా వర్తమానానికి కూడా పాఠమని పరిశోధన చెబుతోంది. 2024లో మీరు గమనించారా? పశ్చిమ భారత్లో విపరీతంగా వర్షాలు కురిశాయి కానీ ఈశాన్యంలో మాత్రం వర్షం అంతగా కురవలేదు. దీనికి కారణం ఆ వర్షపుపట్టీ కాస్త కిందికి జారిపోవడమే. ఇలాంటి విచిత్రాలు పాకిస్థాన్, చైనా దేశాలలో కూడా కనిపించాయి. ఇక మన జీవితానికి వర్షం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. రైతులు వర్షంపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. కానీ వర్షపు తీరు కూడా ఇలా మారిపోతే ఏమవుతుంది? కరువు లేదా వరద తాండవిస్తుంది. ఒకవైపు పొలాలు ఎండిపోతే, మరోవైపు ఇళ్ళను ముంచెత్తే వరదలు ప్రజల జీవితాలను తలకిందులు చేస్తాయి. అందుకే అంటార్కటికాలో మంచు పెరిగితే, ఇక్కడ మన పొలాల్లో వర్షపు పరిస్థితి మారిపోతుంది. ఎంత బలమైన బంధమో చూడండి. కాబట్టి ఇది కేవలం చరిత్ర కాదు, మన భవిష్యత్తుకి హెచ్చరిక కూడా. వాతావరణ మార్పులు మన కంటికి కనిపించకపోయినా, వాటి ప్రభావం మన గుండెల మీద పడుతూనే ఉంది. ఈ రహస్యాలను అర్థం చేసుకుంటే, రేపటి వర్షాల ఆటలతో మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోగలం. లేకుంటే విధ్వంసం, వినాశనం తప్పదండి!
