Let's talk: editor@tmv.in
ఖైరతాబాద్‌లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రారంభం

ఖైరతాబాద్‌లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రారంభం

Gaddamidi Naveen
15 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల ‘ప్రజా పాలన’ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ దాసరితో పాటు రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొని, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ కోసం ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వానిదే కాదు, పౌరులందరి సమిష్టి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉండే అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్' గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించి ఆసుపత్రికి తరలించే వ్యక్తులకు ప్రభుత్వం తరపున రూ. 25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు.