
బెంగాల్ ప్రజలు ఉగ్రవాదులా?: కేజ్రీవాల్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు ఉగ్రవాదులా? అని వ్యాఖ్యానిస్తూ, ఇది రాష్ట్ర ప్రజలకు అవమానమని అన్నారు. బాలిగంజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన కేజ్రీవాల్, దేశవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల భద్రతా సిబ్బందిని తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో బలగాలు ఎందుకు అవసరం? ప్రజలపై భయం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆయన టీఎంసీ అభ్యర్థి శోభన్‌దేబ్ చట్టోపాధ్యాయకు మద్దతుగా ప్రచారం చేశారు.
కేంద్రంపై ఆరోపణలు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. నన్ను జైలుకు పంపారు. కానీ కోర్టు తీర్పు ఇచ్చి అన్ని ఆరోపణలు తప్పు అని చెప్పిందని అన్నారు. ఓటరు జాబితాల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. నకిలీ ఓటర్లను చేర్చుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మోడీకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారు ఈడీ, సీబీఐ, జ్ఞానేశ్ కుమార్ అంటూ వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీకి మద్దతు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ, ఆమెకు మద్దతుగా మాట్లాడారు. ఒక మహిళపై అంతా దాడి చేస్తున్నారు. అయినా ఆమె గెలుస్తుందని అన్నారు. బెలేఘాటాలో మరో సభలో మాట్లాడుతూ ఇది సాధారణ ఎన్నిక కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు చేస్తూ ఇంత బలహీనమైన ప్రధానిని 75 ఏళ్లలో చూడలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో సుమారు 27 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వంపైనే ప్రశ్నలు వస్తాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ లో చేసిన మంచి పనులను వారు నిలిపివేశారు. బెంగాల్‌లో కూడా అదే చేస్తారని అన్నారు.
