Let's talk: editor@tmv.in
ఆర్చర్ ప్రథమేష్ జావ్‌కర్‌పై రెండేళ్ల నిషేధం

ఆర్చర్ ప్రథమేష్ జావ్‌కర్‌పై రెండేళ్ల నిషేధం

Shaik Mohammad Shaffee
22 ఏప్రిల్, 2026

భారత యువ ఆర్చర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత ప్రథమేష్ జావ్‌కర్‌పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ రెండేళ్ల నిషేధం విధించింది. డోపింగ్ నిరోధక నిబంధనల్లో భాగంగా అథ్లెట్లు తమ ఆచూకీ తెలపాలనే నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నిషేధం ఏప్రిల్ 19 నుండి అమలులోకి రావడంతో, ప్రథమేష్ 2028 ఏప్రిల్ వరకు ఎటువంటి ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదు.

ఏమిటీ ఉల్లంఘన?

డోపింగ్ నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్'లో ఉన్న అథ్లెట్లు తాము ఎక్కడ ఉంటున్నామో ఎప్పటికప్పుడు 'ఆడమ్స్' అనే వ్యవస్థలో అప్‌డేట్ చేయాలి. తద్వారా అధికారులు ఎప్పుడైనా వచ్చి పరీక్షలు చేసే వీలుంటుంది. ప్రథమేష్ గడిచిన 12 నెలల కాలంలో (గత ఏడాది జనవరి, జూలై, అక్టోబరులలో) మూడుసార్లు తన ఆచూకీ వివరాలను తెలపడంలో విఫలమయ్యాడు. యాంటీ డోపింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.4 ప్రకారం మూడుసార్లు ఇలా విఫలమైతే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

నిర్లక్ష్యమే కొంపముంచింది!

ఈ ఆరోపణలను ప్రథమేష్ జావ్‌కర్ అంగీకరించాడు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత, ఈ నిషేధాన్ని సవాలు చేయకూడదని అతడు నిర్ణయించుకున్నాడు. దీనిపై స్పందిస్తూ.. "ఇది కేవలం నా నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం, విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ప్రయాణ వివరాలపై స్పష్టత లేకపోవడం వల్ల డెడ్‌లైన్లు దాటిపోయాయి" అని ప్రథమేష్ అంగీకరించాడు. అయితే శిక్షణను మాత్రం ఆపనని, ఆశ కోల్పోకుండా ప్రాక్టీస్ కొనసాగిస్తానని ప్రథమేష్ ధీమా వ్యక్తం చేశాడు.

కెరీర్‌లో పెను అడ్డంకి

22 ఏళ్ల ప్రథమేష్ జావ్‌కర్ భారత ఆర్చరీలో ఎదుగుతున్న ఆశాకిరణం. 2023లో హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో ఓజస్ ప్రవీణ్ డియోతలె, అభిషేక్ వర్మలతో కలిసి కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది షాంఘై వరల్డ్ కప్‌లో వ్యక్తిగత స్వర్ణంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించాడు. తాజా నిషేధంతో అతడు రాబోయే ఆసియా క్రీడలతో పాటు 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలను కూడా దాదాపు కోల్పోయినట్లయ్యింది. 2028 ఏప్రిల్ 18 తర్వాతే అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టగలడు.