Let's talk: editor@tmv.in
ఇంధన కొరతతో ఆక్వా రైతుల కష్టాలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది: వైఎస్ షర్మిల

ఇంధన కొరతతో ఆక్వా రైతుల కష్టాలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది: వైఎస్ షర్మిల

Panthagani Anusha
29 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఇంధన కొరత సమస్య ఇప్పుడు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్ లభ్యత పడిపోవడంతో రొయ్యల సాగు చేస్తున్న రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా ఆమె స్పందిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వేల కోట్లు పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు.

రొయ్యల చెరువులకు ప్రాణాధారమైన ఎయిరేటర్లు (ఫ్యాన్ సిస్టమ్స్) నిరంతరం తిరగాలంటే డీజిల్ వినియోగం తప్పనిసరి. అయితే రాష్ట్రంలోని మెజారిటీ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో రైతులు డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. కేవలం రూ.500 డీజిల్ కోసం ఒక రైతు పెట్రోల్ బంకు యజమానిని వేడుకుంటున్న దృశ్యం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి రొయ్య పిల్లలను వేసిన రైతులు, ఇంధనం లేక అవి చనిపోతుంటే గుండె కోత అనుభవిస్తున్నారని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అసలు ఇంధన సంక్షోభం ఉందో లేదో ప్రజలకు స్పష్టత ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని షర్మిల ఘాటుగా విమర్శించారు. సుమారు 3,000 పెట్రోల్ బంకుల్లో "నో స్టాక్" బోర్డులు దర్శనమిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. "కేవలం వదంతులు నమ్మొద్దని ప్రకటనలు చేయడం వల్ల సమస్య తీరదు. వాస్తవ పరిస్థితులను గుర్తించి పెట్రోల్, డీజిల్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి" అని ఆమె డిమాండ్ చేశారు. రైతులను రక్షించలేని ఈ పాలన ఎవరి కోసమని ఆమె ఆక్షేపించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా షర్మిల విస్మయం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఉన్న రాష్ట్రంలోనే ఇంధన కొరత రావడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఇంధన కొరత ప్రభావం కేవలం ఆక్వా రంగంపైనే కాకుండా రవాణా వ్యవస్థపై కూడా పడిందని దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవాలని ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.