Let's talk: editor@tmv.in
ఈ-బస్సుల వైపు ఏపీఎస్‌ఆర్టీసీ.. ప్రైవేటీకరణ లేదని ప్రభుత్వ స్పష్టీకరణ

ఈ-బస్సుల వైపు ఏపీఎస్‌ఆర్టీసీ.. ప్రైవేటీకరణ లేదని ప్రభుత్వ స్పష్టీకరణ

Dantu Vijaya Lakshmi Prasanna
10 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)ను దేశంలోనే అత్యాధునిక, పర్యావరణహిత ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద 2029 నాటికి సంస్థలోని 10,600కు పైగా బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. ఈ మేరకు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.

ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ వద్ద 8,012 సొంత బస్సులు, సుమారు 2,650 అద్దె బస్సులు ఉన్నాయి. ఇకపై సంస్థ కొనుగోలు చేసే అన్ని కొత్త బస్సులు తప్పనిసరిగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే కావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ చర్యతో ప్రజలకు సౌకర్యవంతమైన, కాలుష్యరహిత ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ప్రైవేటీకరణ లేదని స్పష్టీకరణ

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని కృష్ణబాబు స్పష్టం చేశారు. సంస్థను ప్రైవేటీకరించడం, సంస్థకు చెందిన భూములు లేదా ఇతర ఆస్తులను అమ్మడం, బదిలీ చేయడం లేదా లీజుకు ఇవ్వడం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో లేవని తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎలక్ట్రిక్ బస్సులతో పర్యావరణానికి మేలు

డీజిల్ ఆధారిత బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల వల్ల శిలాజ ఇంధనాల వినియోగం గణనీయంగా తగ్గుతుందని, వాయు కాలుష్యం తగ్గడంతో పాటు దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందిస్తాయని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఫేమ్–2 పథకం కింద ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, కడప, మదనపల్లె మార్గాల్లో 100 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో నడుపుతోంది. విద్యుత్ ఛార్జీలతో కలిపి కిలోమీటరుకు సుమారు రూ.50 వ్యయంతో ఈ బస్సులు విజయవంతంగా సేవలందిస్తున్నాయని, ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పూర్తిగా సాధ్యమేనని ఈ ప్రయోగం నిరూపించిందని కృష్ణబాబు వివరించారు.

జీసీసీ విధానంలోనే కొత్త బస్సులు

బ్యాటరీ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలో ఉండటం, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వ్యయం అధికంగా ఉండటం, అలాగే ఏపీఎస్‌ఆర్టీసీలో సిబ్బంది కొరత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ఎలక్ట్రిక్ బస్సుల పథకాలూ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

పీఎం ఈ-బస్ సేవ పథకంలో 1,050 బస్సులు

పీఎం ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రంలోని 11 నగరాలకు 16 డిపోల ద్వారా 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ బస్సుల కొనుగోలు ప్రక్రియను కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.

ఇందులో 750 బస్సులకు టెండర్లు ఇప్పటికే ఖరారయ్యాయి, మిగిలిన 300 బస్సుల టెండర్ ప్రక్రియ జాతీయ స్థాయిలో కొనసాగుతోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పౌర మౌలిక వసతులకు 60 శాతం, విద్యుత్ మౌలిక వసతులకు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తూ మొత్తం రూ.145.3 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఛార్జింగ్ స్టేషన్లు, నిర్వహణ కేంద్రాలను ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేయనుందని కృష్ణబాబు వివరించారు.

రూ.1,774 కోట్ల ప్రోత్సాహకాలు

ఈ పథకం ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీకి సుమారు రూ.1,774 కోట్ల ప్రోత్సాహకాలు లభించనున్నాయి. 12 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులకు కిలోమీటరుకు రూ.24, 9 మీటర్ల బస్సులకు రూ.22 చొప్పున 12 సంవత్సరాల పాటు ప్రోత్సాహకం లభిస్తుంది.

అలాగే 12 మీటర్ల బస్సులకు తొలి 200 కిలోమీటర్ల వరకు కిలోమీటరుకు రూ.48.5, ఆ తర్వాత రూ.36.2 చొప్పున చెల్లింపులు ఉంటాయి. 9 మీటర్ల బస్సులకు కిలోమీటరుకు రూ.40.1 చొప్పున చెల్లించనున్నారని తెలిపారు.

మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు గాజువాక, సింహపురి, కాకినాడ, రాజమహేంద్రవరం, విద్యాధరపురం, మంగళగిరి, గుంటూరు, నెల్లూరు, మంగళం, కడప, కర్నూలు, అనంతపురం డిపోల నుంచి నడవనున్నాయని తెలిపారు.

అందులో విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం డిపోలకు తొలి విడతలో 100 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నారు.

ఉద్యోగులకు పూర్తి రక్షణ

ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఏ ఉద్యోగి కూడా ఉద్యోగాన్ని కోల్పోరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా కాపాడుతామని హామీ ఇచ్చింది.

అలాగే డ్రై లీజ్ విధానం అమలుపై పరిశీలన జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ విధానంలో బస్సుల నిర్వహణ బాధ్యతను తయారీ సంస్థలు చేపడతాయి. అయితే డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన వారే ఉంటారు. దీంతో ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని కృష్ణబాబు స్పష్టం చేశారు.

ఒప్పంద కాలంలో నిర్వహణ సంస్థలు ఏపీఎస్‌ఆర్టీసీ గ్యారేజీలను కేవలం ఛార్జింగ్, నిర్వహణ అవసరాలకే ఉపయోగిస్తాయని, ఒప్పందం ముగిసిన తర్వాత ఆ స్థలాలు తిరిగి సంస్థ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.

కొత్త ఎలక్ట్రిక్ బస్ డిపోలు

సింహపురి, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఒక్కోటి రూ.15 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బస్ డిపోలు నిర్మిస్తున్నారు. అదనంగా సింహపురి, కుప్పంలో భూములు కేటాయించగా, తిరుమల, తిరుపతి సహా మరికొన్ని ప్రాంతాల్లో కొత్త డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలిస్తోందని కృష్ణబాబు అన్నారు.

ప్రజా రవాణా సేవలను మరింత విస్తరించేందుకు 903 అదనపు బస్సుల కొనుగోలుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆమోదం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్యలతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా, పర్యావరణహితంగా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు
APSRTCElectricBusesAndhraPradeshAPGovernmentElectricMobilityMobilityPolicy4_0GreenTransportPublicTransportEVBusesSustainableTransportAPNewsAmaravatiPMEBusSewaElectricVehiclesCleanEnergyAPSRTCNewsTransportNewsAndhraNewsEVPolicyRoadTransport
ఈ-బస్సుల వైపు ఏపీఎస్‌ఆర్టీసీ.. ప్రైవేటీకరణ లేదని ప్రభుత్వ స్పష్టీకరణ - Tholi Paluku