

అమరావతికి రూ.1,299 కోట్ల కేంద్ర ప్రాజెక్టులకు ఆమోదం..కేంద్రానికి సీఎం కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో ‘సెంట్రల్ జనరల్ పూల్ ఆఫీస్ అకామడేషన్’ (సీజీజీపీఓఏ) భవన సముదాయ నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆయన బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికి మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు పౌరులకు మరింత సమర్థవంతంగా సేవలు అందుతాయని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
హరిత రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతి భవిష్యత్తు వృద్ధికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలక ఉద్దీపనగా నిలుస్తుందని సీఎం అభివర్ణించారు. బహుళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే తాటిపైకి రావడం వల్ల పరిపాలన సులభతరం అవుతుందన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం.. అత్యాధునిక, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో నిర్మించబోయే ఈ భారీ కేంద్ర ప్రభుత్వ భవన సముదాయాన్ని సుమారు రూ. 1,299 కోట్ల అంచనా వ్యయంతో, 23.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఏపీలో ప్రపంచస్థాయి ప్రజా మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ఈ ప్రాజెక్ట్ ఆమోదం మరొక మైలురాయి అని చంద్రబాబు కొనియాడారు.
