
రాహుల్ గాంధీతో భేటీకి అపాయింట్‌మెంట్ ఇవ్వాలి: సీఎం రేవంత్‌కు రామచందర్‌రావు లేఖ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలు వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
2023 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇంకా అందలేదని పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రధాన హామీని కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తిని, నిరాశను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ విషయాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలి. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాతో కలిసి వచ్చి, చర్చలో పాల్గొనడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి గనుక ఈ లేఖపై సానుకూలంగా స్పందించి, రాహుల్ గాంధీతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి, ఇక్కడి ప్రజలకు చేసిన ‘మహా ద్రోహం’ అక్షరాలా నిజమని రుజువవుతుందని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఈ బహిరంగ లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
