Let's talk: editor@tmv.in
'పద్మ’ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
'పద్మ’ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

'పద్మ’ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Shaik Mohammad Shaffee
28 ఏప్రిల్, 2026

దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డుల సందడి మొదలైంది. 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ, జులై 31వ తేదీ వరకు కొనసాగనుంది. అర్హులైన వ్యక్తులను గుర్తించి, వారి సేవలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదొక అద్భుత అవకాశమని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఎవరు అర్హులు?

జాతి, కులం, వృత్తి, లింగ భేదం లేకుండా విశిష్ట సేవలందించిన ప్రతి ఒక్కరూ ఈ పురస్కారాలకు అర్హులే. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్య, పరిశ్రమలు వంటి వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని ఈ అవార్డుల కోసం సిఫార్సు చేయవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు సహా ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కారు. అయితే వైద్యులు, శాస్త్రవేత్తలకు మాత్రం ప్రభుత్వం దీని నుంచి మినహాయింపునిచ్చింది. అంటే వారు ఈ పురస్కారాలకు అర్హులు.

'ప్రజల పద్మ' - సామాన్యులకే అగ్రపీఠం

పద్మ అవార్డులను కేవలం ప్రముఖులకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా సేవ చేస్తున్న ‘అన్‌సంగ్ హీరోస్’ (గుర్తింపు లేని యోధులు)ను వెలికితీయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించాలని పౌరులను కోరింది. పౌరులు తమకు తాముగా కూడా ఈ అవార్డుల కోసం ‘సెల్ఫ్ నామినేషన్’ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

దరఖాస్తు విధానం ఇలా..

పద్మ పురస్కారాల నామినేషన్లను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఆసక్తి గలవారు రాష్ట్రీయ పురస్కార పోర్టల్ (https://awards.gov.in)లో తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలతో పాటు, సదరు వ్యక్తి చేసిన విశిష్ట సేవలను వివరిస్తూ గరిష్టంగా 800 పదాలకు మించకుండా ఒక 'సైటేషన్' రాయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి చేసిన అసాధారణ కృషిని ఇందులో స్పష్టంగా వివరించాలి.

అవార్డులకు సంబంధించిన నియమ నిబంధనలు, ఇతర పూర్తి వివరాల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (https://mha.gov.in) లేదా పద్మ అవార్డుల అధికారిక పోర్టల్ (https://padmaawards.gov.in)లో చూడవచ్చు.

చిచ్చరపిడుగులకూ ‘బాల్ పురస్కార్’

పద్మ అవార్డులతో పాటు, చిన్నారుల్లోని అసాధారణ ప్రతిభను గుర్తించేందుకు ఇచ్చే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2027’కు కూడా కేంద్రం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు-సంస్కృతి వంటి విభాగాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాలలు ఈ పురస్కారానికి అర్హులు. భారతీయ పౌరులై ఉండి, దేశంలో నివసిస్తున్న బాలలు ఎవరైనా ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పురస్కారానికి దరఖాస్తు చేసుకునే నాటికి (జులై 31, 2026 నాటికి) అభ్యర్థుల వయస్సు 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఆసక్తి గల వారు నేరుగా గానీ, ఇతరుల ద్వారా గానీ నామినేషన్లను సమర్పించవచ్చు. వీటికి కూడా జులై 31, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులను రాష్ట్రీయ పురస్కార పోర్టల్ (https://awards.gov.in)లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.