Let's talk: editor@tmv.in
అమరావతి అభివృద్ధికి ఏపీసీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్.. రూ.547 కోట్ల మౌలిక వసతుల పనులకు ఆమోదం

అమరావతి అభివృద్ధికి ఏపీసీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్.. రూ.547 కోట్ల మౌలిక వసతుల పనులకు ఆమోదం

Panthagani Anusha
1 జూన్, 2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన 61వ ఏపీసీఆర్‌డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అథారిటీ సమావేశం అమరావతి భవిష్యత్ నగర నిర్మాణానికి దిక్సూచిగా నిలిచింది. రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చేలా మొత్తం 18 కీలక అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ, వాటన్నింటికీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇక రాజధానిలో న్యాయవ్యవస్థకు పెద్దపీట వేస్తూ అమరావతి హైకోర్టు భవనాల పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.547.07 కోట్ల భారీ నిధులను అథారిటీ మంజూరు చేసింది. దీనితో పాటు నగరంలో పర్యాటక రంగానికి సరికొత్త ఊపునిచ్చేలా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో, డిజైన్-బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ మోడల్‌ ద్వారా ఒక భారీ ‘జెయింట్ అబ్జర్వేషన్ వీల్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అమరావతిని తీర్చిదిద్దేందుకు సమగ్ర ‘అర్బన్ మొబిలిటీ ప్లానింగ్’ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అదేవిదంగా ರಾజధాని ప్రాంత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే వ్యూహంలో భాగంగా ఏలూరు నుంచి ప్రకాశం జిల్లా వరకు విస్తరించి ఉన్న 9 జిల్లాలను కలుపుతూ ప్రతిపాదించిన ‘అమరావతి ఆర్థిక ప్రాంతం అభివృద్ధికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిదంగా నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను కూడా పీపీపీ లేదా జాయింట్ వెంచర్ పద్ధతిలో విస్తరించనున్నారు.

మరోవైపు రాజధాని పరిధిలో అక్రమ నిర్మాణాలు, భూవివాదాల వేగవంతమైన పరిష్కారానికి ప్రత్యేక బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పరస్పర చర్చల ద్వారా వివాదాలు ముగించేందుకు ‘మీడియేషన్ సెంటర్’ను స్థాపించనున్నారు. భద్రతా పరంగా సీఆర్‌డీఏకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ సొంతంగా ‘ఫైర్ వింగ్’ (అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇకపై భవనాలకు ఫైర్ సేఫ్టీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లుజారీ చేసే అధికారాన్ని సీఆర్‌డీఏకే అప్పగించనున్నారు.

ఇక భూములిచ్చిన రైతులకు అండగా నిలుస్తూ తాజా కేటాయింపుల కారణంగా అలాట్‌మెంట్ కోడ్‌లు మారిన 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ల్యాండ్ పూలింగ్, లేఅవుట్లలోని రోడ్డు సెట్బ్యాక్‌ల ప్రభావిత స్థలాల్లో (వీధిపోట్లు ఉన్నచోట) ఏటీఎంలు, కియోస్క్‌ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అనువుగా లేని (నాన్-వయబుల్) ప్లాట్లు కలిగిన లబ్ధిదారులకు నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ కింద గ్రామకంఠంలో గరిష్ఠంగా 5 సెంట్ల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధానిలో తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం గృహ సముదాయాలను నిర్మించనున్నారు. అమరావతిని పర్యావరణహిత ‘బ్లూ-గ్రీన్ సిటీ’గా మారుస్తున్న నేపథ్యంలో కొత్త సాంకేతికతలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే పాత ‘టబ్రీడ్’ ఒప్పందాన్ని రద్దు చేసి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు డక్ట్‌ల ద్వారా చల్లదనాన్ని అందించే సరికొత్త ‘సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ’ కోసం కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీనికోసం ఏపీలోనే అందుబాటులో ఉన్న బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఇక రాజధానిలో నిర్మించే ప్రతి టౌన్‌షిప్ కేవలం నివాస ప్రాంతాలుగానే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ (పని-ఇంటి) సదుపాయాలు, వాణిజ్య కార్యకలాపాలతో కూడిన సజీవ సమాజాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నగరంలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మానవీయ కోణంలో ఆలోచిస్తూ... అమరావతిలో నిర్మించే పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులతో పాటు వచ్చే సహాయకుల (అటెండెంట్లు) కోసం ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.