
ఒమన్ తీరంలో ఏపీ నావికుడి మృతి.. కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం
ఒమన్ తీరంలో వాణిజ్య చమురు రవాణా నౌకపై జరిగిన క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతి చెందిన నావికుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సురేష్ కుటుంబానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించాల్సిందిగా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఒమన్ తీరంలో జరిగిన ఈ ఘోర దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు భారతీయ సిబ్బందిలో సురేష్ ఒకరు. ప్రస్తుతం ఈ నౌక సముద్ర తీరానికి సుమారు 100 కిలోమీటర్లు దూరంలో నిలిచిపోయిందని, దానిని సురక్షితంగా ఓడరేవుకు చేర్చేందుకు ఒమన్ అధికారులు చర్యలు ప్రారంభించారని అధికారులు తెలిపారు.
ఢిల్లీ, ఒమన్‌లతో ఏపీ భవన్ నిరంతర సమన్వయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఈ ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. సురేష్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వం, ఒమన్ ప్రభుత్వం, అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ విషయమై సురేష్ భార్య భార్గవి మాట్లాడుతూ.. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అధికారులు ఈ వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో పలు అంతర్జాతీయ నిబంధనలు, వివిధ ప్రభుత్వాలు, ఏజెన్సీలతో ముడిపడి ఉన్న చట్టపరమైన ఫార్మాలిటీలు పూర్తి కావాల్సి ఉన్నందున భౌతికకాయాన్ని తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం దెబ్బతిన్న నౌక ప్రయాణించే స్థితిలో లేనందున, సముద్రంలో ఉన్న సురేష్ భౌతికకాయాన్ని ఒడ్డుకు తీసుకురావడానికి ఒక ప్రత్యేక టగ్ బోట్‌ను పంపుతున్నట్లు అధికారులు తనకు తెలిపారని భార్గవి వివరించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు దాదాపు 18 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని, శనివారం సాయంత్రానికి భౌతికకాయాన్ని ఒడ్డుకు చేర్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు. కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఇతర అధికారులకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు క్రమంతప్పకుండా మాతో మాట్లాడుతుండటం, ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తుండటం ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని భార్గవి తెలిపారు.
భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందని, బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.
