Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌పై ప్రేమ వదలని ఏపీ పాలకులు.. బాధ్యత ఎక్కడ? ఎమ్మెల్యే చంద్రశేఖర్

హైదరాబాద్‌పై ప్రేమ వదలని ఏపీ పాలకులు.. బాధ్యత ఎక్కడ? ఎమ్మెల్యే చంద్రశేఖర్

Panthagani Anusha
12 మే, 2026

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేతల మాటలకు వారి చేతలకు పొంతన ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఏపీ ప్రజల సెంటిమెంట్లను వాడుకుని పక్క రాష్ట్రంలో విలాసవంతమైన జీవితం గడపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పాలకుల తీరును ఎండగట్టారు.

అమరావతిపై ప్రేమ ఉందా?

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రులను 'కట్టుబట్టలతో గెంటేశారు' అని చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చెప్పారు. కానీ విభజన జరిగి 12 ఏళ్లు దాటినా అందులో 7 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా తన కాపురాన్ని మాత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చలేదని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. అమరావతిని 'దేవతల రాజధాని' అని చెబుతూనే నివాసం మాత్రం హైదరాబాద్‌లోనే ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేవలం రాజకీయ అవసరాల కోసం ఏపీ ప్రజల భావోద్వేగాలను వాడుకుంటూ వ్యక్తిగత సౌకర్యాల కోసం హైదరాబాద్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

నాడు కన్నీళ్లు.. నేడు విలాసాలు

గతంలో తెలంగాణ వచ్చిన బాధలో 16 రోజులు అన్నం తినలేదని చెప్పిన వారు, కోనసీమ సంపద చూసి పక్క రాష్ట్రం అసూయ పడుతోందని వ్యాఖ్యలు చేసిన వారు.. నేడు ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా హైదరాబాద్‌లోనే ఎందుకు ఉంటున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇది రాజకీయ నాటకమా లేక ఆస్తుల మీద వ్యామోహమా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఒక మాట చెప్పి తాము మాత్రం విలాసవంతమైన జీవితాల కోసం పక్క రాష్ట్రంపై మక్కువ చూపడం ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.

జగన్ నిబద్ధత - చంద్రబాబు తీరు

ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించే వారికి చంద్రశేఖర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో పట్టుమని 10 రోజులు కూడా అమరావతిని వదిలి బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజలకు అధికారులకు అందుబాటులోనే ఉన్నారని కానీ చంద్రబాబు వారానికి 3 రోజులు హైదరాబాద్‌లో, 4 రోజులు అమరావతిలో ఉండటం ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు. జగన్ బెంగళూరు వెళ్తే విమర్శలు చేసేవారు తాము మాత్రం నిత్యం హైదరాబాద్‌లో గడపడాన్ని ఏమని పిలవాలని ఎమ్మెల్యే నిలదీశారు.