Let's talk: editor@tmv.in
వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ రికార్డు స్థాయి వృద్ధి!
వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ రికార్డు స్థాయి వృద్ధి!

వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ రికార్డు స్థాయి వృద్ధి!

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2026 జూన్ నెలలో అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. గత ఏడాది (జూన్ 2025) తో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో పన్నుల వసూళ్లు ఏకంగా 16 శాతం వృద్ధిని నమోదు చేస్తూ దాదాపు రూ. 5,000 కోట్లకు (ఖచ్చితంగా రూ. 4,829 కోట్లు) చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 664 కోట్ల అదనపు ఆదాయం లభించిందని రాష్ట్ర వాణిజ్య పన్నుల ప్రధాన కమిషనర్ ఎ. బాబు అధికారిక ప్రకటన విడుదల చేసారు. దీని ప్రకారం, కేవలం నెట్ జీఎస్టీ వసూళ్లే 21 శాతం వృద్ధితో రూ. 3,144 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే రూ. 553 కోట్లు అధికం. పన్నుల వసూళ్లలో నిరంతర పర్యవేక్షణ, కఠినమైన నిబంధనల అమలు వల్లనే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో కూడా రాష్ట్రం తన బలమైన ఆర్థిక పురోగతిని చాటుకుంది. ఏప్రిల్, మే నెలల్లో కనిపించిన సానుకూల ధోరణి జూన్‌లోనూ కొనసాగడంతో, ఈ త్రైమాసికంలో మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు రూ. 15,323 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన రూ. 12,480 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం భారీ వృద్ధి కావడం విశేషం అని బాబు పేర్కొన్నారు. ఈ అసాధారణ వృద్ధికి ప్రధానంగా నెట్ జీఎస్టీ వసూళ్లు తోడ్పడ్డాయని, గత ఏడాది దాదాపు రూ. 8,000 కోట్లుగా ఉన్న నెట్ జీఎస్టీ వసూళ్లు, ఈసారి 25 శాతం పెరిగి రూ. 10,000 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. దీనితో పాటు పెట్రోలియం ఉత్పత్తులపై వచ్చే వ్యాట్‌లో కూడా 21.2 శాతం వృద్ధి నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక స్థితికి మరింత ఊతాన్నిచ్చిందన్నారు.

పన్ను పరిపాలనలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడమే ఈ భారీ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణమని కమిషనర్ వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా అనలిటిక్స్, ఏఐ-ఆధారిత పన్ను పరిశీలన, ఏఐ-ఆధారిత ఐజీఎస్టీ రివర్సల్స్ వంటి వినూత్న విధానాలను ఈ ఏడాది ప్రవేశపెట్టారు. అలాగే, యూపీఐ ఆధారిత అనలిటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిస్కామ్‌లతో అనుసంధానించబడిన రిజిస్ట్రేషన్ల ధృవీకరణ, ఆధార్-ఆధారిత ప్రాసెస్ ద్వారా ప్రొఫెషన్ టాక్స్ పరిధిని విస్తరించడం వంటి చర్యలు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయని కమిషనర్ తెలిపారు.

అంతేకాకుండా, జూన్ 2026 లో ఐజీఎస్టీ సెటిల్మెంట్ రూ. 1,898 కోట్లుగా నమోదైందని. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ. 533 కోట్లు పెరిగిందని నివేదికలో తెలిపారు.ఇది ఒకే నెలలో నమోదైన అత్యధిక ఐజీఎస్టీ వృద్ధిగా రికార్డు సృష్టించింది.

గత ఆర్థిక సంవత్సరం (2025-26) లో సాధించిన 6 శాతం సంచిత వృద్ధిని పునాదిగా చేసుకుని, వాణిజ్య పన్నుల శాఖ అత్యంత క్రమశిక్షణతో కూడిన ఆదాయ సమీకరణను కొనసాగిస్తోంది. పన్ను చెల్లింపుదారుల నుండి పెరిగిన సమ్మతి, పటిష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యూహాలు, విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలు ఈ వృద్ధిని నడిపించాయని అన్నారు. పర్ఫార్మెన్స్ డ్యాష్‌బోర్డ్‌లు, శాఖల మధ్య డేటా షేరింగ్, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు పన్ను పరిపాలన యొక్క వేగాన్ని, ఖచ్చితత్వాన్ని ఉత్పాదకతను పూర్తిగా మార్చివేసాయి. ఈ ఆధునిక పన్ను విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా మరింత స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని ఎ. బాబు ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPGSTGSTCollectionsTaxRevenueAPTaxRevenueCommercialTaxesGSTGrowthStateRevenueAndhraEconomyAPEconomyFiscalGrowthRevenueCollectionAIInGovernanceDigitalGovernanceTaxComplianceEconomicDevelopmentAmaravatiBusinessNews