
అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించిన ఏపీ విద్యుత్ వ్యవస్థ
రాష్ట్రంలో భానుడి భగభగలు, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాయి. కాగా వేసవి కాలంలో ఊహించని విధంగా పెరిగిన విద్యుత్ అవసరాలను ముందస్తు ప్రణాళికతో సమర్థంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే మే 21న ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రిడ్ చరిత్రలోనే అత్యధికంగా 288.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అదే రోజు పగటి సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,016 మెగావాట్లు కాగా రాత్రి సమయంలో 12,474 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో లోడ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతటి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేశాయని అధికారులు వెల్లడించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న తీవ్రమైన వడగాల్పులు, వాతావరణంలో పెరిగిన అధిక తేమ పరిస్థితులే ఈ స్థాయి విద్యుత్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమని విజయానంద్ పేర్కొన్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో గృహ వినియోగదారులు ఎయిర్ కండీషనర్లు, కూలింగ్ పరికరాలను భారీగా వినియోగిస్తున్నారన్నారు. దీనికి తోడు తాగునీటి సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ పంపుసెట్ల వాడకం కూడా ఒక్కసారిగా పెరిగిందని ఫలితంగా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలన్నింటిలోనూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.
ఈ అసాధారణ విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో), ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) మరియు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నిరంతరం సమన్వయంతో పనిచేసినట్లు అధికారులు తెలిపారు. అంతర్గత ఉత్పత్తితో పాటు, గ్రిడ్ భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ చేపట్టామని, అవసరమైన సమయాల్లో షార్ట్‌టర్మ్ మార్కెట్ ద్వారా అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసి కొరత రాకుండా చూశామని స్పష్టం చేశారు.
తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్లు, ఫీల్డ్ సిబ్బంది, సిస్టమ్ ఆపరేటర్లు, నిర్వహణ బృందాలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో వేసవి కాలం పూర్తిగా ముగిసే వరకు విద్యుత్ సరఫరా విషయంలో ఇదే రకమైన అప్రమత్తతను కొనసాగిస్తామని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
