Let's talk: editor@tmv.in
ఎబోలా వైరస్‌పై ఏపీ హై అలర్ట్

ఎబోలా వైరస్‌పై ఏపీ హై అలర్ట్

Panthagani Anusha
25 మే, 2026

ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. రాష్ట్రంలోకి ఈ ప్రమాదకర మహమ్మారి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాల్లో ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులకు పర్యాటకులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విమానాశ్రయ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని విశాఖపట్నం పోర్టుతో పాటు రహదారి మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వారిపై కూడా నిఘా పెంచినట్లు వివరించారు.

15 పడకలతో ఐసోలేషన్ వార్డులు.. సిద్ధంగా పీపీఈ కిట్లు

ఎబోలా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని కోవిడ్ మహమ్మారి సమయంలో పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించమని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల పరిధిలోని బోధనా ఆసుపత్రుల్లో తక్షణమే 15 పడకల చొప్పున ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం పీపీఈ కిట్లు, వైరస్ నిర్ధారణ పరీక్ష కిట్లను తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంచారు. అదేవిదంగా గ్రౌండ్ లెవల్‌లో అవగాహన పెంచేందుకు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల స్థాయి వరకు వర్చువల్ సమావేశాల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆరోగ్య శాఖ హెచ్చరిక: ఎబోలా ప్రాథమిక లక్షణాలు ఇవే

ఎబోలా వైరస్ సోకిన వ్యక్తుల్లో కొన్ని వారాల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని దీనివల్ల వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలు దీనికి సంబంధించిన లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, అధిక బలహీనత, ఆకలి మందగించడం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మరియు కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు: మంత్రి సూచన

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎబోలా ప్రభావిత ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు చేయవద్దని మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గత మూడు వారాల వ్యవధిలో ఆయా దేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే పైన పేర్కొన్న అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని తక్షణమే క్వారంటైన్‌కు తరలించి ఉచిత చికిత్స అందిస్తామని వారితో ప్రాథమికంగా సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.