Let's talk: editor@tmv.in
నిప్పుల కొలిమిలా ఏపీ.. మరో మూడు రోజులు వడగాలులు

నిప్పుల కొలిమిలా ఏపీ.. మరో మూడు రోజులు వడగాలులు

Panthagani Anusha
25 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఉపశమన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఈ సీజన్‌లోనే సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై జనాన్ని బెంబేలెత్తించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సైతం 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 45.7 డిగ్రీలు, విశాఖ రూరల్‌లో 45.6, ప్రకాశం జిల్లా కారేడులో 45.5, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.2, మార్కాపురం జిల్లా నందనమరెల్లలో 44.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా, 17 జిల్లాల్లోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రస్తుత తీవ్రతకు అద్దం పడుతోంది.

అయితే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదవుతోందని, వచ్చే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అధికారిక ప్రకటనలో తెలిపారు. విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం నేడు రాష్ట్రంలోని 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, 166 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉంది. మంగళవారం నాటికి ఈ తీవ్రత మరింత పెరిగి 50 మండలాల్లో తీవ్ర వడగాలులు, 205 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు రాబోయే రోజుల్లో కోనసీమ, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి (పోలవరం ప్రాంతం), ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

ఎండలు మండిపోతున్నప్పటికీ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం లభించనుంది. దీని ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు (బీపీ) ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తగినంత నీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తరచుగా తీసుకోవాలని వైద్య నిపుణులు, అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.