Let's talk: editor@tmv.in
నిప్పుల కొలిమిలా ఏపీ.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నిప్పుల కొలిమిలా ఏపీ.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Panthagani Anusha
18 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు ముదిరిపోయి, ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నిన్న రికార్డు స్థాయికి చేరగా నేడు (శనివారం) కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని అధికారులు స్పష్టం చేశారు.

కాగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సూర్యుడు ప్రతాపం చూపించడంతో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1°C ఉష్ణోగ్రత రికార్డవ్వగా కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9°C నమోదైంది. రాష్ట్రంలోని సుమారు 215 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మార్కాపురం, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో సైతం 44 డిగ్రీల మార్కును తాకింది.

85 మండలాలపై వడగాల్పుల ప్రభావం

ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల ఉధృతి కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని సుమారు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 55 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43°C నుండి 44.5°C వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

మధ్యాహ్నం వేళ అప్రమత్తత అవసరం

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.