Let's talk: editor@tmv.in
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Shaik Mohammad Shaffee
16 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శన కనబరిచారు. గత 12 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 77 శాతం మంది విద్యార్థులు విజయం సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

అమ్మాయిలదే పైచేయి

ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ప్రథమ సంవత్సరంలో 81 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా, బాలుర ఉత్తీర్ణత 72 శాతానికే పరిమితమైంది. ద్వితీయ సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగింది. బాలికలు 85 శాతం, బాలురు 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ 54 శాతం, సెకండియర్ 68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత 12 ఏళ్లతో పోలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ స్థాయి ఫలితాలు రావడం ఇదే మొదటిసారి అని మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్.. అన్నమయ్య జిల్లా వెనుకంజ

జిల్లా వారీ ఫలితాలను పరిశీలిస్తే కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచింది. ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 92 శాతం మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో 21,669 మంది పరీక్ష రాయగా, ఏకంగా 19,952 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. గుంటూరు (88 శాతం), ఎన్టీఆర్ జిల్లా (87 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రథమ సంవత్సరంలోనూ కృష్ణా (90 శాతం) అగ్రస్థానంలో ఉండగా, గుంటూరు (88 శాతం), విశాఖపట్నం (85 శాతం) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే అన్నమయ్య జిల్లా ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో (77 శాతం, 67 శాతం) చివరి స్థానంలో నిలిచి వెనుకబడింది. ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

వాట్సాప్ ద్వారా ఫలితాలు.. 'మన మిత్ర' సేవలు

సాంకేతికతను వినియోగించుకోవడంలో విద్యాశాఖ ముందడుగు వేసింది. విద్యార్థులు తమ ఫలితాలను కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం చేయకుండా 'మన మిత్ర' వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 9552300009 నంబర్‌కు "Hi" అని సందేశం పంపడం ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను సులభంగా పొందారు. అలాగే అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ద్వారా కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు ఫలితాలను చూసుకున్నారు. సుమారు 10.15 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఫలితాల విడుదలతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మే 21 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. వీటికి సంబంధించిన ఫీజును విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించవచ్చు. అలాగే జూన్ 7 నుంచి 11 వరకు జిల్లా కేంద్రాల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం

తమకు వచ్చిన మార్కులపై నమ్మకం లేని లేదా ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని భావించే విద్యార్థుల కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 మధ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు సూచించింది.

విద్యార్థులకు నైతిక మద్దతునిద్దాం

ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. "పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అభినందనలు. కానీ ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులు ఏమాత్రం కుంగిపోవద్దు. ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు, సమాజం విద్యార్థులకు అండగా నిలబడాలి" అని ఆయన కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.