
ఒమాన్‌లో చిక్కుకున్నఅన్నమయ్య జిల్లా మహిళకు ఏపీ ప్రభుత్వం అండ
అన్నమయ్య జిల్లా వయలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఒమాన్‌లో నిర్బంధానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది.
గత ఏడాది నవంబర్‌లో ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లిన దూదేకుల షహ్నాజ్‌కు అప్పగించిన పని నచ్చకపోవడంతో స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంది. అయితే ఆమెను అక్కడి ఏజెంట్లు అడ్డుకుని ఖర్చుల పేరుతో రూ.2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో షహ్నాజ్ భర్త అబూబకర్ ఏపీఎన్‌ఆర్టీ సొసైటీకి ఫిర్యాదు చేయగా సంస్థ వెంటనే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఒమాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. తదనంతరం స్థానిక పోలీసుల సహకారంతో ఏజెంట్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది.
చర్చల ఫలితంగా షహ్నాజ్‌ను ఎలాంటి అదనపు భారం లేకుండా స్వదేశానికి పంపేందుకు ఏజెంట్లు అంగీకరించారు. ఆమె మే 7న ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనుందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, వలస కార్మికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. అలాగే, సమస్య పరిష్కారంలో చొరవ చూపిన ఏపీఎన్‌ఆర్టీ సొసైటీని ఆయన అభినందించారు.
