
కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం
పొట్టకూటి కోసం కువైట్ దేశం వెళ్లి అక్కడ తీవ్ర కష్టాలు పడుతున్న తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి అనే మహిళ ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆమె పడుతున్న ఇబ్బందులపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. బాధితురాలిని ఎలాగైనా సురక్షితంగా వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం భాగ్యవతి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకరి ఇంట్లో పనిమనిషి ఉండేందుకు కువైట్ వెళ్లారు. అయితే అక్కడి ఏజెంట్లు ఆమెకు సరైన ఉద్యోగ వీసా (వర్క్ పర్మిట్) ఇవ్వకుండా మోసం చేశారు. కువైట్ వెళ్లినప్పటి నుంచి ఆమెను అక్కడ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. భరించలేని కష్టాల మధ్య తాను తిరిగి ఇంటికి వచ్చేస్తాను అడగగా ఎక్కువ మొత్తంలో డబ్బులు కడితేనే పంపుతామంటూ అక్కడి వారు భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంటూ తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ అధికారులు వెంటనే కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ)తో మాట్లాడారు. భాగ్యవతికి ఎలాంటి ప్రాణహాని లేకుండా చూస్తూ ఆమెను ఇండియాకు రప్పించేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అమాయక మహిళను మోసం చేసి తప్పుడు వీసాతో విదేశాలకు పంపిన ఏజెంట్లపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా అధికారులు, చంద్రగిరి పోలీసులు భాగ్యవతి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. భాగ్యవతి సురక్షితంగా సొంత ఊరికి చేరేవరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
